‘కోడ్’ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు
Published Sun, Mar 16 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదై పెండింగ్‌లో ఉన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలని ఢిల్లీ ఎన్నికల కమిషన్ (డీఈసీ) అంటోంది. దీని గురించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కలవాలనుకుంటోంది. గత అసెంబ్లీ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన కేసులను పరిశీలిస్తున్నామని, ఈ వివరాలతో ప్రత్యేక డాటాను రూపొందిస్తున్నామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఒకవేళ కేసుల భారం పెరిగి సాధారణ కోర్టుల ద్వారా నియంత్రించలేకపోతే, ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలనే అంశాన్ని న్యాయమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళతామని వివరించారు.
ప్రాథమ్యత ఆధారంగా కేసులను పరిష్కరించేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయాలని అభ్యర్థిస్తామన్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 2013, డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా ఆమ్ ఆద్మీ పార్టీపై వందకి పైగా కేసులు, బీజేపీపై 80 కేసులు, కాంగ్రెస్‌పై 75 కేసులు నమోదయ్యాయన్నారు. ఏప్రిల్ పదిన ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిశాక కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశాన్ని న్యాయమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళతామని వివరించారు. ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులతో రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Advertisement