సరైన అనుమతి పత్రాలు లేకుండా నడుస్తోన్న రేడియో టాక్సీ కంపనీల సేవలపై నిషేధం విధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: సరైన అనుమతి పత్రాలు లేకుండా నడుస్తోన్న రేడియో టాక్సీ కంపనీల సేవలపై నిషేధం విధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టాక్సీలు అద్దెకిచ్చేందుకు ఉబర్, ఓలా కంపనీలు నడిపే మొబైల్ యాప్‌లను బ్లాక్ చేయవలసిందిగా ఆప్ సర్కారు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను బుధవారం కోరింది. నగరంలో టాక్సీలు నడిపేందుకు తమ లెసైన్సులు ప్రాసెస్ కావాలనుకుంటున్నట్లయితే ఉబర్, ఓలా కంపనీలు తమ సేవలను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వ రవాణా విభాగం మంగళవారం ఈ రెండింటికి లేఖ కూడా రాసింది. వీటి దరఖాస్తులు ప్రాసెస్ కావాలంటే ఈ కంపనీలు తమపై విధించిన నిషేధం ఉత్తర్వులను తు.చ.తప్పక పాటిస్తున్నట్లు అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందని రవాణా విభాగం ఆ లేఖలో పేర్కొంది.గతేడాది ఓ ప్రయాణికురాలి(25)పై ఉబర్ కంపనీకి చెందిన డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసు ప్రస్తుతం న్యాయ విచారణలో ఉంది. కాగా, ఆ అత్యాచార సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అనుమతుల్లేని వెబ్ ఆధారిత టాక్సీ కంపనీల సేవలపై నిషేధం విధించింది. అయితే ఉబర్, ఓలా కంపనీలు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా తమ సేవలను కొనసాగించాయి. ఈ సంచలనాత్మక సంఘటన జరిగిన తర్వాత ఉబర్ కంపనీ కొన్ని రోజుల పాటు తన సేవలను నిలిపివేసింది. కానీ, వెనువెంటనే రేడియో టాక్సీ లెసైన్స్ కోసం ఉబర్ కంపనీ దరఖాస్తు చేసుకుని జనవరిలో మళ్లీ సేవలను ప్రారంభించింది. దీంతో ఈ రెండు కంపనీల సేవలపై నిషేధం విధించే ప్రయత్నాలను ప్రభుత్వం మళ్లీ చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా ఈ కంపనీల మొబైల్ యాప్‌ను బ్లాక్ చేయించాలుకుంటోంది. ఈ కంపనీల ఐపీని బ్లాక్ చేసినట్లయితే వాటి వెబ్‌సైట్, మొబైల్ ఫోన్ అప్లికేషన్ ఢిల్లీలో అందుబాటులో ఉండదు.