నెలాఖరున మేయర్ల ఎన్నిక
Published Sat, Apr 12 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెలాఖరువరకు నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు కొత్త మేయర్లను, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ల కార్యదర్శులు ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సంవత్సరం మేయర్ పదవులను షెడ్యూల్డు కులాలకు (ఎస్సీలు) రిజర్వు చేశారు. నగరంలో లోక్‌సభ ఎన్నికల సందడి ముగిసిందో లేదో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ఆరంభం కావడం విశేషం. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏప్రిల్ 28న, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏప్రిల్ 29న జరుగనుంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ ఆధిక్యతలో ఉండడం వల్ల ఈ పార్టీకి చెందిన వారే మేయర్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని యోగేంద్ర చందోలియా, రామ్‌కిషన్ భన్సీవాల్ ఆశిస్తున్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రదీప్ కుమార్, ఖుషీరామ్ భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్‌కుమార్ డిల్లో, సుదేష్ణ తూర్పు ఢిల్లీ మేయర్ పదవికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Advertisement