ఢిల్లీ ఓటరు రూటే వేరు..
Published Fri, Aug 23 2013 12:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: దేశంలో అన్ని రాజకీయపార్టీలు తమ ఓటుబ్యాంక్‌ను నమ్ముకునే రాజకీయాలు చేస్తుం టాయి. వాటికి కులాలు, మతాలు, సామాజిక వర్గాలు అండగా ఉంటుంటాయి. ఏ రాష్ట్రం చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.. కానీ ఢిల్లీలో మాత్రం కులాల కన్నా శ్రేణుల ప్రభావమే పార్టీలపై ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
ఢిల్లీలో ప్రజలు సంపన్న శ్రేణి, మధ్య తరగతి శ్రేణి, పేదవర్గాలు ఇలా మూడు రకాలుగా విడిపోయి వివిధ పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీ రాజకీయాలలో నెగ్గాలంటే కులాల కంటే ఎక్కువగా వివిధ వర్గాలపైనే దృష్టి సారించాల్సిన అవసరముందని, ఇవి గెలుపునే ప్రభావితం చేయగలిగే రీతిలో ఉన్నాయని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) పరిశోధకుడు సంజయ్ కుమార్ తెలిపారు. ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఎలక్టోరల్ పొలిటిక్స్ ఇన్ ఢిల్లీ: ఫ్రమ్ క్లాస్ టూ క్యాస్ట్’ పుస్తకాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ‘ఈ పుస్తకంలో మారిన ఢిల్లీ ఓటర్ల మనోభావాలు వెల్లడించేందుకు ప్రయత్నించా. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు, తర్వాత ఓటర్ల అభిప్రాయాలను సేకరించా.
అప్పటి స్థితులను వివరిస్తూనే ప్రస్తుతం నగరంలో ఉన్న ఓటర్ల వ్యవహార శైలి ఎలా ఉందో వివరించే ప్రయత్నం చేశాన’ని సంజయ్ అన్నారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి అనేక మంది వలస వచ్చి స్థిరపడ్డారు. వీరిలో దిగువ, పేద తరగతి వర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. పేదల సంఖ్య విపరీతంగా పెరిగింద’ని కుమార్ అన్నారు. 1993లో ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ రాజకీయాలను దగ్గర నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ‘ఢిల్లీని ఒక నగరంగా చూడటం కష్టం. ఎందుకంటే మూడు నగరాలు భౌగోళికంగా ఇందులో కలిసిపోయాయి. కాని సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మాత్రం ఇంకా విడిగానే ఉన్నాయన్నారు. ఢిల్లీలో బీజేపీకి సరైన నాయకుడు లేకపోవడంవల్లే ఇక్కడ అధికారాన్ని చేపట్టలేకపోయిందని ఆయన పుస్తకంలో వివరించారు. మదన్‌లాల్ ఖురానా పోయిన తర్వాత అలాంటి నాయకుడు కనిపించలేదన్నారు.
2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఉన్న ఉన్నత శ్రేణికి చెందిన కొన్ని ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయన్నారు. కార్యక్రమానికి హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ భారత్‌లోని పోలింగ్ సరళిపై ఇప్పటివరకు విస్తృతస్థాయిలో చర్చలు జరగలేదన్నారు. ఒకే కులానికి చెందిన ప్రజలు ఉన్నత, మధ్య, దిగువస్థాయి శ్రేణులుగా విడిపోయారని, వీరు వివిధ పార్టీలకు మద్దతిస్తున్నారనే విషయం ఈ పుస్తకం ద్వారా కుమార్ చక్కగా వివరించారన్నారు. పట్టణ రాజకీయాలు ఎంతో ప్రధానమైనవని, రానురాను ఇక్కడి ఓటర్లలో కూడా పెనుమార్పు వస్తోందని పుణే వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎన్నికల విధానం, పోటీ, స్థానిక రాజకీయాల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంజయ్‌కుమార్ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం గమనార్హం.
Advertisement