సాక్షి, ముంబై: ఠాణే జిల్లా విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ నానాటికీ ఊపందుకుంటోంది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంద్వారా తదుపరి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీలు భావిస్తున్నట్టు సమాచారం. ఠాణే జిల్లాలో కాషాయ కూటమిని ఎదుర్కొనేందుకు విభజన మంచి అంశంగా అధికార పక్షం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోగా జిల్లా విభజనపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర అవతరణ దినమైన మే ఒకటో తేదీని విభజనకు ముహూర్తం ఖరారు చేయనున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా వెలుగొందుతున్న ఠాణే జిల్లాను విభజించాలన్న డిమాండ్ ఈనాటిది కాదు. గత ఏడాదికూడా ఈ డిమాండ్ తెరపైకి వచ్చినప్పటికీ ప్రభుత్వం అంతగా స్పందించలేదు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈసారి మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక విభజన అంశానికి సంబంధించిన గతంలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం. 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న శరద్‌పవార్ ఈ జిల్లా విభజన అవసరమని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి 29 ఏళ్లు గడిచిపోయినా ఇప్పటిదాకా ఏమీజరగలేదు. అయితే ఈసారి మాత్రం మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు.
లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సమయంలో ఠాణే జిల్లా విభజన అంశం ప్రధానంగా తెరపైకి వచ్చేది. ఈ అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఎన్నికలకు ముందు ఇటువంటివాటిని తెరపైకి తీసుకురావడంద్వారా ప్రజల మనోభావాలతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఈ జిల్లాను రెండుగా విభజించాలని డిమాండ్ ఉండేది. అనంతరం మూడు, నాలుగు జిల్లాలుగా కూడా విభజించాలనే డిమాండ్‌లు కూడా వచ్చాయి. మూడు నాలుగు జిల్లాలుగా విభజించకపోయినా కనీసం రెండింటిగా విభజించడం ఖాయమని తెలుస్తోంది. అదేవిధంగా జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఓ ప్రశ్నగా మారింది. అనేకమంది పాల్ఘర్ జిల్లా కేంద్రంగా ఉండాలని భావిస్తే కొందరు జవ్హార్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏదిఏమైనప్పటికీ పాల్ఘర్ జిల్లా కేంద్రంగా విభజన జరగనుందని తెలుస్తోంది.
జిల్లా నేపథ్యం....
గత రెండు దశాబ్దాల కాలంలో ఈ జిల్లా జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా ఇది మారింది. సుమారు కోటికిపైగా జనాభా, 9,558 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఇక ఇతర జిల్లాల తో పోలిస్తే ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువే. జనాభాతోపాటు ఇక్కడ నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. నగరాలు, పట్టణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, పశ్చిమ తీర ప్రాంతం ఇలా మూడు విభాగాలుగా ఈ జిల్లాను చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో ఠాణే, కళ్యాణ్-డోంబివలి, నవీముంబై, భివండీ-నిజాంపురా, ఉల్లాస్‌నగర్, మీరారోడ్డు-భయిందర్, వసాయి-విరార్ తదితర ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతోపాటు ఆదివాసి, గిరిజన ప్రాంతాలు కూడా భారీగా ఉన్నాయి. దీంతో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండే ప్రాంతాన్ని ఠాణే జిల్లాగా, ఆదివాసి, గిరిజన ప్రాంతాలను ఒక జిల్లాగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
ఇక రాజకీయపరంగా...
పాల్ఘర్‌ను జిల్లా కేంద్రంగా చేసినట్టయితే ఠాణే కంటే పాల్ఘర్ జిల్లా పెద్దగా మారుతుంది. అయితే రాజకీయంగా మాత్రం ఠాణే జిల్లాకే ప్రాధాన్యం లభించే అవకాశముంది. ప్రస్తుతం ఠాణే జిల్లాలో నాలుగు లోక్‌సభ, 22 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. విభజన అనంతరం పాల్ఘర్‌లో ఓ లోక్‌సభ (పాల్ఘర్) మరో నాలుగు శాసనసభా నియోజకవర్గాలు ఉండగా, ఠాణేలో మాత్రం మూడు లోక్‌సభ (ఠాణే, భివండీ, కల్యాణ్), 18 శాసనసభా నియోజకవర్గాలు ఉండనున్నాయి.
ఠాణే విభజన మళ్లీ తెరపైకి
Published Fri, Feb 21 2014 11:12 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement