![పెద్దనోట్ల రద్దుతో కేంద్రానికి అదొక్కటే లాభం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/61479813970_625x300.jpg.webp?itok=gycRIRRu)
పెద్దనోట్ల రద్దుతో కేంద్రానికి అదొక్కటే లాభం
ముంబై: ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రయోగం నిజమైన నల్లధనాన్ని వెలికితీయడంలో విఫలమైందని విమర్శించింది. ఆకలి, నిరుద్యోగం, ఉగ్రవాదం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ప్రభుత్వానికి ఉపయోగపడిందని పేర్కొంది. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీరును శివసేన తప్పుపట్టింది.
పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా ప్రజలు ముఖ్యమైన జాతీయ సమస్యలను మరిచిపోయేలా చేయడంలో కేంద్రం విజయవంతమైందని ఆరోపించింది. పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు క్యూలలో ఒక్క కుబేరుడు కూడా నిలబడలేదని, దీన్నిబట్టి నిజమైన నల‍్లధనం బయటకు రాలేదని తెలుస్తోందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మద్దతుదారులు ఈ విషయాన్ని అంగీకరించాలని సూచించింది. ప్రధాని మోదీ సమక్షంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పెద్దనోట్ల రద్దు నిర‍్ణయాన్ని సమర్థించడాన్ని సామ్నా పత్రికలో శివసేన తప్పుపట్టింది.
ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని శివసేన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతేగాక విపక్షాలతో కలసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసింది.