
శ్రీవారి గరుడ సేవకే టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి... బయట క్యూ లైన్లలో బారులు తీరారు. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నేడు గరుడ సేవ సందర్భంగా ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. గరుడ సేవకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సేవను వీక్షించేందుకు భక్తులకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది.
మధ్యాహ్నం 12.00 గంటల నుంచి భక్తులను ఈ గ్యాలరీల్లోకి అనుమతి ఇస్తారని అధికారులు వెల్లడించారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అన్న ప్రసాద కేంద్రంలోనూ భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 2.00 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరగుతుందని టీటీడీ తెలిపింది.