బదిలీ వేటు!
సాక్షి, చెన్నై : రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ త్రిపాఠి బదిలీ వేటుకు గురయ్యారు. ఆ పగ్గాల్ని సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ శైలేంద్రబాబుకు అప్పగించారు. చెన్నై పోలీసు కమిషనర్ రాజేంద్రన్‌ను మార్చి అసుతోష్ శుక్లాను నియమించారు. సోమవారం రాష్ట్రంలోకి పారా మిలటరీ బలగాలు అడుగు పెట్టనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్ని పకడ్బందీగా విజయవంతానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తుల్ని వేగవంతం చేసింది. అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌ల భరతం పట్టే విధంగా ఎన్నికల బదిలీల పర్వానికి చర్యలు చేపట్టారు. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జోరుగా సాగుతూ వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో శనివారం రాష్ట్ర డీజీపీ అశోక్‌కుమార్ పై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేసింది. ఆయన స్థానంలో పోలీసు శిక్షణ క ళాశాల డీజీపీ మహేంద్రన్‌ను నియమించారు. ఎన్నికలయ్యే వరకు మహేంద్రన్ డీజీపీగా వ్యవహరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారుల అండదండాలతో గట్టెక్క వచ్చన్న ధీమాతో ఉన్న అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే విధంగా ఎన్నికల యంత్రాంగం పరుగులు తీస్తుండడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఈ సమయంలో రాష్ర్టంలో డీజీపీ తర్వాత స్థానంలో శాంతి భద్రతల పగ్గాల్ని పర్యవేక్షించే అదనపు డీజీపీపై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేసింది.
అన్నాడీఎంకేకు విధేయుడిగా ఆ పదవిలో త్రిపాఠి ఉండడంతో బదిలీ వేటకు చర్యలు చేపట్టారు. చెన్నై పోలీసు కమిషనర్‌గా, జైళ్ల శాఖ ఏడీజీపీగా పనిచేసి, శాంతి భద్రతల విభాగానికి అదనపు డీజీపీగా వ్యవహరిస్తున్న త్రిపాఠి అమ్మ జయలలితకు అత్యంత విధేయుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి పక్కన పెట్టిన, ఎన్నికల యంత్రాంగం సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ శైలేంద్ర బాబును రంగంలోకి దించింది. డైనమిక్ పర్సన్‌గా పిలవబడే శైలేంద్రబాబును రంగంలోకి దించడంతో అన్నాడీఎంకే వర్గాలు ఇరకాటంలో పడ్డట్టే. ఇక, చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రాజేం ద్రన్ కూడా అధికార పక్షం భక్తుడే అన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ డీజీపీ రామానుజం శిష్యుడిగా పిలవడే రాజేంద్రన్ గతంలో శాంతి భద్రతల విభా గం అదనపు డీజీపీగా వ్యవహరించారు. ప్రస్తుతం చెన్నై పోలీసు కమిషనర్‌గా ఉన్న ఆయన్ను పక్కన పెట్టి, ఎక్సైజ్ శాఖ అదనపు డీజీపీగా ఉన్న అసుతోష్ శుక్లాను రంగంలోకి దించారు.
రంగంలోకి పారామిలటరీ : రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేని దృష్ట్యా, బదిలీ పర్వం మీద దృష్టి పెట్టి, నిజాయితీ, నిక్కచ్చితనం కల్గిన అధికారుల్ని ఎన్నికల యంత్రాంగం నియమిస్తూ వస్తున్న విషయం తెలిసింది. వీరితో పాటుగా ముప్పై వేల మందితో కూడిన పారా మిలటరీ బలగాలతో ఎన్నికల భద్రత పర్యవేక్షణకు సిద్ధమైంది. 300 కంపెనీలకు చెందిన ఈ బలగాలు సోమవారం నుంచి రాష్ట్రంలోకి రానున్నాయి. తొలి బృందం ఉదయాన్నే సెంట్రల్ స్టేషన్‌కు చేరుకోనుంది. ఈనెల ఏడో తేదిలోపు ముప్పై వేల మందితో కూడిన పారా మిలటరీ బలగాలు ఎన్నికల భద్రతను తమ గుప్పెట్లోకి తీసుకోబోతున్నాయి. వీరితో పాటుగా 118 మంది శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులు రంగలోకి దిగనున్నారు. దీంతో నగదు బట్వాడా అడ్డుకట్ట, శాంతి భద్రతల పరిరక్షణ దిశగా చర్యలు వేగవంతం అయ్యాయి. ఇక, ప్రజలు 1950 టోల్‌ఫ్రీం, 9444123456 వాట్సాప్‌కు , 18004256669(ఐటీ) టోల్ ఫ్రీనంబర్లకు ఫిర్యాదులు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ సూచించారు. ఇక, డీజీపీ, ఏడీజీపీల మార్పుతో పాటుగా ఐపీఎస్‌ల బదిలీ పర్వం సాగి ఉన్న దృష్ట్యా, ఇక ఎన్నికల భద్రతా పర్యవేక్షణ పూర్తి వ్యవహారాలు లఖానీ చేతికి చేరినట్టే.
నేడు తుది జాబితా : నామినేషన్ల పరిశీలన పర్వం ముగియడంతో సోమవారం ఉప సంహరణ కార్యక్రమం జరగనుంది. తదుపరి తుది జాబితాను ప్రకటించబోతున్నారు. దాఖలైన 7153 నామినేషన్లలో 2,628 పరిశీలనలో తిరస్కరించ బడ్డాయి. 4485 నామినేషన్లు పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో ఉప సంహరణలు ఏ మేరకు సాగనున్నాయో ఆ మేరకు తుది జాబితాను ప్రకటించనున్నారు. పరిశీలనానంతరం అత్యధిక శాతంగా 47 మంది అభ్యర్థులు ఉన్న జాబితాగా సీఎం జయలలిత రేసులో ఉన్న ఆర్కేనగర్ నిలవగా, తక్కువ సంఖ్యలో ఎనిమిది మంది అభ్యర్థులతో కూడలూరు చివరి స్థానంలో నిలిచింది.