దిగ్విజయ్ సింగ్‌ను కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ పదవినుంచి తప్పించండి
పార్టీ బలోపేతానికి ఆయన చేసిందేమీ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్
బెంగళూరు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్‌ను మార్చాలన్న కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేల డిమాండ్ సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిగ్విజయ్ సింగ్‌ను మార్చడం అత్యంత ఆవశ్యకమని విశ్వనాథ్ పేర్కొన్నారు.
దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వస్తారు, వెళ్లిపోతారు తప్పితే పార్టీ పటిష్టత కోసం ఆయన చేస్తున్నదేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన నేతలతో అసలు దిగ్విజయ్ సింగ్ సమావేశం కారని, వారి అభిప్రాయాలను తెలుసుకోరని విమర్శించారు. గతంలో కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్‌గా ఉన్న గులామ్‌నబీ ఆజాద్ రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకునేందుకు బస్‌లో పర్యటించి పార్టీ పటిష్టత కోసం కృషి చేసేవారని ఈ సందర్భంగా విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు.