రాజధాని నిర్మాణంలో బాబు తాజా నిర్ణయం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సీఎం చంద్రబాబు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చరిత్రపై అవగాహన ఉన్న వారి సలహాలు తీసుకోవాలని సీఎం సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా గౌతమి పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి సలహాలు తీసుకోవాలని ఆదివారం జరిగిన అమరావతి నిర్మాణ సమీక్షలో ఈ మేరకు నిర్ణయించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణంలో దర్శకుడు రాజమౌళిని సీఆర్డీఏ అధికారులు సంప్రదించిన విషయం తెలిసిందే. రాజధాని డిజైన్ల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో రాజమౌళిని కూడా చేర్చాలని బాబు అధికారులకు సూచించారు.
సీఎం చంద్రబాబు తాజా నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణంలో బాబు పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. విదేశీ, సినిమా రంగాలపై మోజుతో సరికొత్త దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో భూములిచ్చిన రైతులు, స్థానిక కూలీల భాగస్వామ్యాన్ని సీఎం మర్చిపోయారని ఆర్కే మండిపడ్డారు.