ఆయన స్టైలే వేరు
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నేను హీరోగా నటిస్తున్నాననగానే సినీ పరిశ్రమలో చాలా మంది ఆశ్చర్యపోయారని నటుడు సూర్య అన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం మాస్. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యువన్ శంకర్‌రాజా సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది.
మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ బిరియానీ చిత్ర షూటింగ్ సమయంలో మాస్ చిత్ర సింగిల్ లైన్‌ను నిర్మిత జ్ఞానవేల్ రాజాకు చెప్పానన్నారు. ఆయన సూర్యకు చెప్పడం లైన్ బాగుంది వెంకట్‌ప్రభును ఒకసారి కలవమని చెప్పడంతో ఈ చిత్రానికి బీజం పడిందన్నారు. మాస్ చిత్రం కోసం చాలా శ్రమించానన్నారు. చాయాగ్రాహకుడు ఆర్‌డీ.రాజశేఖర్, సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా పనితనం చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చిందన్నారు. ఇది 200 శాతం సూర్య చిత్రం అని వెంకట్ ప్రభు పేర్కొన్నారు.
పిల్లలకు బాగా నచ్చే చిత్రం : నటుడు సూర్య మాట్లాడుతూ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నాననగానే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అని చెప్పారు. సాధారణంగా దర్శకులు ఒక స్ట్రాంగ్ పాయింట్ పట్టుకుని చిత్రాలు రూపొందిస్తుంటారన్నారు. అలాంటిది దర్శకుడు వెంకట్‌ప్రభు స్టైల్ వేరని పేర్కొన్నారు. అది తనకు బాగా నచ్చిన విషయం అన్నారు.మాస్ హర్రర్, కథా చిత్రం కాదని, అలాగే భయపెట్టే చిత్రం కాదని, ఇదో కొత్త కోణంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథా చిత్రం అని స్పష్టం చేశారు. మాస్ తన కెరీర్‌లో కొత్త డెమైన్షన్ కథా చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని సూర్య వ్యక్తం చేశారు.