
భారతదేశంలో అతిపెద్ద స్కామ్ చేసి లండన్ పారిపోయిన ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) జీవితాన్ని సినిమా రూపంలో ఈ ప్రపంచానికి చూపనున్నారు. ఈమేరకు చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా ఈ సినిమా రానుందని, దీనిని బాలీవుడ్ దర్శకుడు పలాష్ వాస్వానీ తెరకెక్కించబోతున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.
దేశంలోని బ్యాంకింగ్ రంగంలో భారీ స్కామ్స్‌కు పాల్పడిన నీరవ్ మోదీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పవన్ సి.లాల్ ఒక పుస్తకం రచించారు. 'ఫ్లాల్డ్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ డైమండ్ మొఘల్ నీరవ్ మోదీ' పేరుతో మార్కెట్లో కూడా ఈ బుక్ అందుబాటులో ఉంది. దీనిని ఆధారంగా చేసుకునే దర్శకుడు పలాష్ వాస్వానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.
అసలేమిటి ఈ స్కామ్..?
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్‌ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్‌ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్‌బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది.
2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్‌లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్‌లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు.