సాక్షి, ముంబై: ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, పేలుడు, భవనాలు కూలడం..ఇలా ఎలాంటి ప్రమాదం జరిగిన ముందుగా అక్కడికి చేరుకునేది అగ్నిమాపక వాహనాలే...అలాంటి శాఖలో ఉద్యోగుల కొరత చాన్నాళ్లుగానే వేధిస్తోంది. దీనికితోడు శిక్షణ పూర్తిచేసుకుని సిద్ధంగా ఉన్న సిబ్బందిని విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల మంటలను సకాలంలో అదుపులోకి తీసుకురావడం ఉన్నవారికి కష్టమవుతోంది. శాఖలో ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోంది. అనేక సందర్భాలలో వారాంతపు సెలవులు, దీర్ఘకాలిక సెలవులు కూడా తీసుకోవడం లేదు. దీంతో నెలల తరబడి కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందికి అదనపు పనిగంటలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ డబ్బులు కూడా నెలలు గడిచినా చేతికి అందడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం పలుమార్లు అధికారుల చుట్టు తిరగాల్సి వస్తోందంటున్నారు.
మూడు వాహనాలకు ఒక్కడే డ్రైవర్...
నగరంలో మొత్తం 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. అనేక సంవ త్సరాల నుంచి సిబ్బంది కొరత వల్ల ఫైరింజన్లు మూలనపడి ఉన్నాయి. మూడు వాహనాలకు ఒక్కడే డ్రైవర్ విధులు నిర్వహిస్తున్నాడు. డ్రైవర్లతోపాటు మంటలను ఆర్పివేసే సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి కిందిస్థాయి సిబ్బంది తీసుకొచ్చారు. అయినా వాటిని భర్తీచేయలేదు. చివరకు గతేడాది 125 మందిని భర్తీ చేశారు. వడాలలోని అగ్నిమాపక కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అది పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వారిని విధుల్లోకి తీసుకోలేదు.
వెంటనే విధుల్లోకి తీసుకోండి
అదనంగా పనిచేసిన ఓటీ డబ్బులు సకాలంలో చెల్లించాలని, శిక్షణ పూర్తిచేసిన సిబ్బందిని వెంటనే వీధుల్లోకి తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది సంక్షేమం కోసం పోరాడే కార్మిక యూనియన్ అనేకసార్లు బీఎంసీ పరిపాలన విభాగం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు బీఎంసీ అదనపు కమిషనర్ మనీషా మైసేకర్‌తో భేటీ అయ్యారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాలతోపాటు అదనంగా అవసరమైన సిబ్బంది జాబితా అందజేశారు. ముంబైలోని అగ్నిమాపక కేంద్రాలకు 269 మంది అధికారులు, 204 మంది ప్రధానాధికారులు, 322 మంది ఫైరింజన్లు నడిపే డ్రైవర్లు, 198 మంది మంటలను ఆర్పివేసే సిబ్బంది అవసరముందని పేర్కొన్నారు. ఇంతపెద్ద సంఖ్యలో సిబ్బంది కొరతను పరిశీలించిన మైసేకర్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. సాధ్యమైనంత త్వరగా కొత్తగా భర్తీ ప్రక్రియ, శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బందిని విధుల్లోకి చేర్చుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో కామ్ బంద్ ఆందోళన చేపడతామని కార్మిక యూనియన్ అధ్యక్షుడు సూర్యకాంత్ మాడిక్ హెచ్చరించారు.