- ఎమ్మెల్యేలకు సీఎం హితవు
- రహస్య సమావేశాలపై అసంతృప్తి
- ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయొద్దని క్లాస్
- సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని సలహా
- మంత్రులపై ఆరోపణలు చేయడం తగదని సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు, విందులు, వినోదాలను ఏర్పాటు చేస్తుండడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం విధాన సౌధలో జరిగిన సీఎల్‌పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ఏవైనా సమస్యలుంటే పార్టీ వేదికపైనే చర్చించుకోవాలని సూచించారు. నియోజక వర్గాల్లో సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలని కోరారు.
లేనట్లయితే కేపీసీసీ అధ్యక్షుడిని కూడా కలుసుకోవచ్చని సూచించారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. తమ పనులు జరిగి తీరాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టడం సరికాదని హితవు పలికారు. చట్టం పరిధిలో తాము పని చేయాల్సి ఉంటుందని, కనుక కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉండకపోవచ్చని వివరించారు.
అలాంటి సందర్భాల్లో మంత్రులపై ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. మంగళవారం రాత్రి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో సమావేశం కావడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇకమీదట ఇలాంటి పొరపాట్లు చేయవద్దని సలహా ఇచ్చారు. మంత్రులు కూడా ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై ఆయా ఎమ్మెల్యేలతో చర్చించాలని, స్థానిక సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావాలని ఆదేశించారు.
పేదలకు త్వరలో ఇళ్లు
వివిధ పథకాల కింద ఇళ్ల పంపిణీకి సంబంధించి లోటు పాట్లను నివారించి, అర్హులైన పేదలకు సత్వరమే వాటిని ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ పథకాలకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఎమ్మెల్యేలకు ఫిబ్రవరిలో కూడా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఇళ్ల పంపిణీని చేపడతామన్నారు. సమావేశం తర్వాత సీఎల్‌పీ కార్యదర్శి సీఎస్. అప్పాజీ నాడగౌడ విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రయ, బసవ వసతి సహా వివిధ పథకాల కింద మూడు లక్షల ఇళ్ల పంపిణీ నిలిచిపోవడంపై ఎమ్మెల్యేలు సమావేశంలో ప్రస్తావించారని తెలిపారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తానని సీఎం భరోసా ఇచ్చారని చెప్పారు.