- అధికారులకు సీఎం సూచన
- యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలకు ఆదేశం
- నిధుల కొరత లేదని స్పష్టీకరణ
- ఇక సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రతి వారం సమావేశం
- నీటి ఎద్దడి గ్రామాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రాన్ని వరుసగా నాలుగో ఏడాది కరువు కబళించిందని, కనుక అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. తాగు నీటి సదుపాయం, కరువు సహాయక పనులకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇక్కడి క్యాంప్ కార్యాలయంృకష్ణాలో గురువారం ఆయన కరువు సహాయక పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
తాగు నీరు, పశు గ్రాసం, విద్యుత్ సమస్యలపై జిల్లా పంచాయతీల సీఈఓలు ప్రతి వారం సమావేశాన్ని నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రభుత్వంృదష్టికి తీసుకు రావాలన్నారు. రాష్ట్రంలో మరో 22 వారాలకు సరిపడా పశు గ్రాసం ఉందని, భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా రైతులకు పశు గ్రాసం కిట్లను అందించి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.
వరుస కరువు వల్ల తాగు నీరు, పశు గ్రాసానికి హాహాకారాలు మిన్ను ముట్టాయని తెలిపారు. కరువును సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన పనులను చేపట్టడం లేదని నిష్టూరమాడారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు కరువు సహాయక పనులకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే విడుదలైందని చెప్పారు. 1085 గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు.
ఆ గ్రామాల్లో 1,500 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. మొత్తమ్మీద రాష్ర్ట వ్యాప్తంగా 11,640 గ్రామాల్లో తాగు నీటి సమస్య ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ల వద్ద నిధులున్నాయని, అత్యవసర పనులకు వీటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో మంత్రులు శ్రీనివాస ప్రసాద్, డీకే. శివ కుమార్, హెచ్‌కే. పాటిల్, టీబీ. జయచంద్ర, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.