► అసెంబ్లీలో మిన్నంటిన నినాదం
► అన్నాడీఎంకేతో డీఎంకే వాగ్యుద్ధం
► సభ నిబంధనలకు విలువనివ్వాలని స్టాలిన్ హితవు
► కరుణ జపం చేసుకోవచ్చని పన్నీరు సూచన
చిన్నమ్మ శశికళ జపం అసెంబ్లీని తాకింది. చిన్నమ్మ నామస్మరణతో మంత్రి సెల్వరాజ్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని రేపాయి. డీఎంకే, అన్నాడీఎంకే వర్గాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. సభ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వొద్దని, విలువల్ని పాటించాలని ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హితవు పలికారు. అయితే కరుణానిధి జపం చేసుకోండంటూ సీఎం పన్నీరుసెల్వం డీఎంకే సభ్యులకు సూచించడం గమనార్హం.
సాక్షి, చెన్నై:
అమ్మ జయలలిత మరణం తదుపరి పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన చిన్నమ్మ శశికళ మెప్పు కోసం అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర కుస్తీలు పడుతున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ నామ స్మరణ మార్మోగిస్తున్నారు. ఈ జపం కాస్తా సోమవారం అసెంబ్లీని తాకింది. ప్రశ్నోత్తరాల సమయంలో తెన్ కాశి అన్నాడీఎంకే సభ్యుడు సెల్వమోహన్ దాస్ సంధించిన ప్రశ్నకు మంత్రి సెల్వరాజ్ సమాధానం ఇచ్చారు. ముందుగా అమ్మ జయలలితను పొగడ్తలతో ముంచెత్తుతూ, చిన్నమ్మ నామస్మరణ అందుకున్నారు. పదే పదే చిన్నమ్మ శశికళను ప్రశంసిస్తూ మంత్రి వ్యాఖ్యలు సంధించడాన్ని డీఎంకే శాసనసభాపక్ష ఉపనేత దురై మురుగన్ తీవ్రంగా ఖండించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ జోక్యం చేసుకుని సభా విలువల్ని పాటించాలని హితవు పలికారు. అయినా మంత్రి ఏ మాత్రం తగ్గకుండా చిన్నమ్మ జపం సాగిస్తూ రావడంతో సభలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది.
పార్టీల నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటే, ఇక, కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాంధీ జపం అందుకుంటారేమోనని డీఎంకే వర్గాలు చమత్కరించాయి. ఇంతలో సీఎం పన్నీరుసెల్వం జోక్యం చేసుకుని, చిన్నమ్మ జపంలో తప్పు లేదని, మంత్రి వ్యాఖ్యలను సమర్థించారు. కావాలంటే, కరుణానిధి జపం, నామస్మరణకు అసెంబ్లీని మీరు వేదికగా చేసుకోండంటూ డీఎంకే వర్గాలకు హితవు పలికారు. ఆ తప్పులు చేయాల్సిన అవసరం తమకు లేదని, కరుణానిధి సభలో సభ్యుడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ డీఎంకే వర్గాలు నినదించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం ముదిరింది. చివరకు స్పీకర్ ధనపాల్ జోక్యం చేసుకుని, సీఎం పన్నీరుసెల్వం స్పష్టం చేశారుగా, ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దామంటూ ముగింపు పలికారు.
వీరులకు నివాళి: ముందుగా సభలో కశ్మీర్ లోయల్లో మంచు చరియలు విరిగి పడడంతో మరణించిన ఆర్మీ వీరులకు నివాళులర్పించారు. రాష్ట్రానికి చెందిన ఇలవరసన్, సుందర పాండియన్ కుటుంబాలకు సభ సానుభూతి తెలియజేసింది. వారి మృతికి సంతాప సూచకంగా సభలో సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
తస్మాత్ జాగ్రత్త ... ఇక జరిమానా మోత: ఇళ్లు, మాల్స్, అపార్ట్‌మెంట్లలోని మురికి నీటిని ఇక రోడ్డు మీద ఇష్టారాజ్యంగా వదలి పెడితే తస్మాత్ జాగ్రత్త జరిమానా మోత మోగుతుందంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఇందుకు తగ్గ ముసాయిదా అసెంబ్లీలో దాఖలైంది. పురపాలక శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి ఈ ముసాయిదాను ప్రశ్నోత్తరాల అనంతరం సభలో దాఖలు చేశారు. ఇళ్లు, దుకాణాల నుంచి మురికి నీరు రోడ్డు మీదకు వస్తే రూ.ఐదు వేలు, రూ.పది వేలు జరిమానా విధించనున్నట్టు వివరించారు. ప్రత్యేక భవనాలు, దుకాణాలకు రూ.20 నుంచి రూ.50 వేల వరకు, అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తులు, మాల్స్ నుంచి రోడ్డు మీదకు మురికి నీరు చేరిన పక్షంలో రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు జరిమానా విధించనున్నట్టు ఆ ముసాయిదా ద్వారా హెచ్చరించారు.
స్వైన్ ఫ్లూ నివారణకు చర్యలు: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ తాండవం అసెంబ్లీకి చేరింది. డీఎంకే శాసన సభాపక్ష ఉపనేత దురై మురుగన్ అసెంబ్లీలో స్వైన్ ఫ్లూ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యల్లోని అంశాలను సభా పద్దుల నుంచి తొలగిస్తూ స్పీకర్ ధనపాల్ నిర్ణయించారు. ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అంశాలు వద్దంటూ, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌కు మాట్లాడే అవకాశం కల్పించారు. వేలూరు జిల్లాలో కేరళ నుంచి వచ్చిన పలువురికి హెచ్ 1, ఎన్ 1 ఉన్నట్టు గుర్తించినట్టు, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తన ప్రసంగంలో వివరించారు.
చిన్నమ్మకు ఆహ్వానాలు: అసెంబ్లీలో చిన్నమ్మ జపం మిన్నంటితే, ఆ చిన్నమ్మ దర్శనం కోసం పోయేస్ గార్డెన్ వద్ద సోమవారం పెద్ద క్యూ సాగింది. ఇందులో అన్నాడీఎంకే నీలకోట్టై ఎమ్మెల్యే తన వివాహం రోజును పురస్కరించుకుని చిన్నమ్మ ఆశీస్సుల్ని కుటుంబంతో కలిసి అందుకున్నారు. అలంగానల్లూరు, పాలమేడు, అవనీయాపురంల నుంచి గ్రామ పెద్దలు తరలి వచ్చారు. తమ గ్రామాల్లో జరిగే జల్లికట్టుకు హాజరు కావాలని ఆహ్వానం పలికారు.