► జయ స్థానంలో శశికళ
► కరుణ బాధ్యతల్లో స్టాలిన్
► అన్నాడీఎంకే, డీఎంకేలో ఒకేసారి మార్పులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అవునంటే కాదని, కాదంటే అవునని వ్యవహరించే డీఎంకే, అన్నాడీఎంకేలో విచిత్రంగా ఒకే రకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. జయలలిత మరణంతో శశికళ, కరుణానిధి అస్వస్థతతో స్టాలిన్ ఆయా పార్టీల సారథులుగా మారిపోయారు. కాంగ్రెస్ అగ్రనేత కామరాజనాడార్ నాటి జాతీయ భావాలకు నీళ్లొదిలి ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన డీఎంకే, అన్నాడీఎంకేలు కొత్త నాయకత్వంతో మళ్లీ పూర్తిగా ప్రాంతీ య ధోరణిలోకి మళ్లినట్టు భావించాల్సి వస్తోంది. డీఎంకేలో అన్నాదురై నాయకత్వం తరువాత కరుణానిధి సారథ్యాన్ని ప్రజలు ఏకగ్రీవంగా అంగీకరించారు. అలాగే అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ మరణంతో అదే రీతిలో జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టగా తమిళనాడు యావత్తు జయకు జేజేలు పలికారు. వయస్సు, అనుభవం రీత్యా కరుణానిధితో పోల్చుకుంటే జయలలిత చిన్నదైనా దీటుగా నిలదొక్కున్నారు. డీఎంకేను మట్టికరిపించి అనేక ఎన్నికల్లో జయభేరీ మోగించారు.
జయలలిత ఆకస్మిక మరణం, కరుణ వృద్ధాప్యంతో మరలా ఆ రెండు పార్టీలకు కొత్త అ«ధినాయకత్వం అవసరమైంది. ఎంతోకాలంగా అందరూ ఊహిస్తున్నట్లుగానే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ నియమితులయ్యారు. స్టాలినే తనకు సరైన రాజకీయ వారసుడని కరుణానిధి ఎంతో కాలంగా చెబుతూ వచ్చారు. అందరూ ఊహించినట్లుగా బుధవారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించేశారు. కరుణానిధి ఈ పని ఏనోడో చేసి ఉండాల్సిందని నేతలంతా ముక్తకంఠం హర్షం వెలిబుచ్చారు. చిన్ననాటి నుంచి తండ్రి వద్దే రాజకీయ శిష్యరికం చేసిన స్టాలిన్ పార్టీని నల్లేరుపై బండిలా నడిపించేయగలరు.
అసంతృప్తుల వలయంలో శశికళ: ఇక ఎటొచ్చి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపైనే అందరి అనుమానాలు. జయలలిత వెనుక ఉంటూ చాటుమాటు రాజకీయాలు మినహా ప్రత్యక్ష రాజకీయాల అనుభవం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. జయకు శశికళ రాజకీయ వారసురాలు ఎలాగనే విషయంలోనే స్పష్టత లేదంటూ కొందరు మెటికలు విరుస్తున్నారు. పార్టీలోని 80 శాతం వ్యతిరేకిస్తున్నా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టడంతో పార్టీలోని కిందిస్థాయిలో అసంతృప్తి ఎక్కువైంది. శశికళ బొమ్మ కనపడితే చాలు చించేస్తున్నారు. జయలలిత అన్న కుమార్తె దీప అన్నాడీఎంకేకు అసలైన వారసురాలని అధికశాతం మంది పేర్కొనడం ద్వారా శశికళ ఎన్నిక అందరికీ ఆమోదయోగ్యం కాదని తేలిపోయింది.
జయకు నీడలా నిలిచిన శశికళకు మించిన నాయకత్వం లేదని కొందరు వాదిస్తున్నారు. అంతటితో సరిపెట్టుకోక సీఎం బాధ్యతలు సైతం చిన్నమ్మకు అప్పగించాలని తహతహలాడుతున్నారు. అన్నాడీఎంకే ఓట్ల కోసం ఇప్పట్లో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రధాన కార్యదర్శిగా శశికళ సత్తా ఏమిటో, డీఎంకే కొత్త సారధి స్టాలిన్ కు దీటుగా ఎలా వ్యవహరిస్తారో తెలిసేందుకు కొంతకాలం వేచి చూడాల్సిందే.