ప్రకటించిన డీఎంకే
173 స్థానాల్లో అభ్యర్థులు
మళ్లీ తిరువారూర్‌లో కరుణ
కొళత్తూరులో స్టాలిన్
19 మంది మహిళలకు సీట్లు
పుదుచ్చేరిలోనూ కుదిరిన ఒప్పందం
ఒకే జాబితాగా అభ్యర్థులు చిట్టాను డీఎంకే ప్రకటించింది. 173 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతూ జాబితాను అధినేత కరుణానిధి ప్రకటించారు. మళ్లీ తిరువారూర్ నుంచి కరుణానిధి, కొళత్తూరు నుంచి ఎంకే స్టాలిన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ముఖ్య నేతలతో పాటు, కొత్త ముఖాలకు పెద్ద పీట వేశారు. 19 మంది మహిళలకు చోటు కల్పించారు. ఇక పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్‌తో పొత్తు సఫలీకృతమైంది.
సాక్షి, చెన్నై : మళ్లీ అధికారమే లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించి వ్యూహాల్ని రచిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్, ఇండియన్‌యూనియన్ ముస్లిం లీగ్, మనిద నేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, ఎండీఎండీకే, పెరుంతలైవర్ మక్కల్ కట్చి, సమూహ సమత్తువ పడై, వ్యవసాయ తొళిలార్ కట్చిలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. మిత్రలందరికీ సీట్ల పంపకాలు ముగియడంతో, ఇక 173 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు నిర్ణయించారు.
ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కరుణానిధి బుధవారం సాయంత్రం ప్రకటించారు. తిరువారూర్ నుంచి కరుణానిధి, కొలత్తూరు నుంచి ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేయనున్నారు. ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న దురైమురుగన్ - కాట్పాడి నుంచి పోటీ చేస్తుండగా, వయోభారం దృష్ట్యా, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, సీనియర్ నేట ఆర్కాటు వీరస్వామి రేసు నుంచి తప్పుకున్నారు.
ఇక, పార్టీలు ముఖ్య నాయకులుగా, మాజీ మంత్రులుగా పనిచేసిన కేఎన్ నెహ్రూ, పొన్ముడి, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, పూంగోదై, సురేష్ రాజన్, తంగం తెన్నరసు, కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, ఐ పెరియస్వామి, ఏవీ వేలు, వంటి ముఖ్యులకు, మాజీ స్పీకర్ ఆవుడయప్పన్‌కు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురికి మళ్లీ సీటు కేటాయించారు. దక్షిణాది జిల్లాల్లో, కొంగు మండలం, డెల్టా జిల్లాల్లో అత్యధికంగా కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఇక, 19 మంది మహిళలకు డీఎంకేలో సీటు కేటాయించడం విశేషం. సీఎం జయలలిత బరిలో ఉన్న ఆర్‌కే నగర్ నుంచి మహిళా అభ్యర్థిగా సిమ్లా ముత్తు చొళన్ ఎన్నికల్లో ఢీ కొట్టనున్నారు.
కొన్ని స్థానాల్లో అభ్యర్థుల వివరాలు :
చెన్నై చేపాక్కం - ట్రిప్లికేన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్భళగన్ మళ్లీ రేసులో దిగారు. పొన్నేరి- కె పరిమలం, తిరువళ్లూరు - విజి రాజేంద్రన్, పూందమల్లి- పరంథామన్, ఆవడి - నాజర్, మాదవరం - ఎస్‌సుదర్శన్, విల్లివాక్కం - రంగనాధన్, ఎగ్మూర్ - కేఎస్ రవిచంద్రన్, సైదా పేట - ఎం సుబ్రమణ్యన్, హార్బర్ పీకే శేఖర్ బాబు, అన్నానగర్ - ఎంకే మోహన్, థౌజండ్ లైట్స్ - సెల్వం విరుగంబాక్కం ధన శేఖరన్, వేళచ్చేరి - సినీ నటుడు వాగై చంద్రశేఖరన్, తాంబరం -ఎస్‌ఆర్ రాజ, పల్లావరం - ఇ కరుణానిధి, కాట్పాడి - దురై మురుగన్, తిరుచెందూరు - అనితా రాధాకృష్ణన్, తిరుకోవిలూరు - పొన్ముడి, ఆత్తూరు - ఐ పెరియస్వామి, తిరుచ్చి పశ్చిమం కేఎన్ నెహ్రు, ఆలంకులం - పూంగోదై, పాళయం కోట్టై - మైదీన్ ఖాన్, తిరుచ్చూలి - తంగం తెన్నరసు, తిరువణ్ణామలై - ఏవి వేలు, నాగర్‌కోవిల్ సురేష్ రాజన్, కురింజి పాడి - ఎం ఆర్‌కే పన్నీరు సెల్వంలతో పాటుగా 173 మంది ఈ ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అలాగే, గుమ్మిడిపూండి నియోజకవర్గాన్ని డీఎండీకే నుంచి బయటకు వచ్చిన ఎండిఎండికేకు కేటాయించారు.
పుదుచ్చేరిలోనూ :
తమిళనాటే కాదు, పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ , డిఎంకేలు కలసి కట్టుగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలం ఎక్కువ కావడంతో ఆ పార్టీకి ఎక్కువ స్థానాల్ని కేటాయించారు. ఇక్కడ కాంగ్రెస్ 21 స్థానాల్లోనూ, డిఎంకే 9 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. ఇందుకు తగ్గ ఒప్పంద పత్రాలపై డిఎంకే అధినేత ఎం కరుణానిధి, పుదుచ్చేరి కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి నారాయణ స్వామి తదితరులు సంతకాలు చేశారు.
ఒకే జాబితా !
Published Thu, Apr 14 2016 9:13 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM
Advertisement