త్రీ ఆప్షన్స్!
Published Mon, Dec 16 2013 1:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
‘కాంగ్రెస్‌తోనే కలసి నడుద్దాం... బీజేపీతో దోస్తీ కడుదాం..., ఒంటరిగానే ఎన్నికల్ని ఎదుర్కొందాం...’ అంటూ మూడు ఆప్షన్ల సందేశాన్ని డీఎంకే నాయకులు అధినేత కరుణానిధి ముందు ఉంచారు. చివరకు తుది నిర్ణయం అధికారాన్ని అధినేత కరుణానిధికి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్‌కు అప్పగించారు. తమిళాస్త్రంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సర్వ సభ్య సమావేశంలో దుమ్మెత్తి పోయడం గమనార్హం.
సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతూ సర్వ సభ్య సమావేశానికి డీఎంకే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఉదయం అన్నా అరివాళయంలోని కలైంజర్ అరంగంలో ఈ సమావేశం ఆరంభం అయింది. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్ నేతలు దురై మురుగన్, ఆర్కాడు వీరాస్వామి తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, పార్టీ జిల్లాల నాయకులు తదితర వెయ్యిమందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యూరు. పదిన్నర గంటలకు సమావేశం ఆరంభం కాగానే, సర్వసభ్య సమావేశం తీర్మానాల్ని ఒక్కో నాయకుడు తమ ప్రసంగాల ద్వారా వివరించారు.
త మిళ ప్రజల అభ్యున్నతి, సంక్షేమ నినాదంతో ఎన్నికలకు సిద్ధం అయ్యారు. సింగపూర్‌లో తమిళులపై దాడులు, కేరళలోని అట్టపాడిలో తమిళుల గెంటివేత, తమిళ జాలర్లపై శ్రీలంక ఆగడాలు, ఈలం తమిళులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ తీర్మానాలు చేశారు. శ్రీలంకను అంతర్జాతీయ న్యాయస్థానం బోనులో ఉంచడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రత్యేక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపును దుయ్యబట్టారు. విద్యుత్ కోతలు, ఇసుక కుంభకోణం, ధరల పెరుగుదలపై విరుచుకు పడ్డారు. వీటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
గతుకులుగా ఉన్న రహదారులు, గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి తదితర ప్రజా సమస్యల్ని ఎత్తి చూపుతూ తీర్మానాలు చేశారు. తమిళ ప్రజల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం లక్ష్యంగా డీఎంకే ముందుకెళుతుందని ప్రకటించారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు నత్తనడకన సాగిన దృష్ట్యా, మరో ఏడాది కాలం పొడిగించారు. 2014 చివరి లోపు ఎన్నికల్ని పూర్తి చేయాలని నిర్ణయిస్తూ, అంత వరకు ప్రస్తుతం ఉన్న కార్యవర్గాలే కొనసాగుతాయని ప్రకటించారు. మండేలా మృతికి సంతాపం తెలియజేశారు.
తీర్మానాల అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోక్‌సభ ఎన్నికలపై చర్చ సాగింది. అందరు నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించారు. లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అందరి అభిప్రాయాల్ని స్వీకరించారు. ప్రసంగించిన వారిలో పలువురు కాంగ్రెస్‌తోనే కలసి పయనిద్దామని కరుణానిధి దృష్టికి తెచ్చారు.
మరి కొందరు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని గుర్తుచేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. బీజేపీతో దోస్తీ కడుదామని, డీఎండీకేను చేర్చుకుందామంటూ వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ శాతం మంది బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయగా, ఆ తర్వాత స్థానంలో పొత్తులే వద్దంటూ వాదించిన వాళ్లున్నారు. కాంగ్రెస్‌తో, బీజేపీతోనో, డీఎండీకేతోనో క లసి కూటమి ఏర్పాటు చేయడం కన్నా, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొని సత్తా చాటడం మంచిదన్న నిర్ణయాన్ని కరుణానిధి ముందు ఉంచారు.
కరుణకే అప్పగింత: లోక్ సభ ఎన్నికలకు సంబధించి పొత్తులు, సంప్రదింపులు, తదితర అన్ని వ్యవహారాలపై తుది నిర్ణయం కరుణానిధి, అన్భళగన్ తీసుకోవచ్చన్న తీర్మానాన్ని ఆమోదిస్తూ స్టాలిన్ ప్రకటించారు. మీడియాతో కరుణానిధి మాట్లాడుతూ, పొత్తులు, ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంప్రదింపులు తదితర వ్యవహారాల నిమిత్తం ఓ కమిటీని ప్రకటించనున్నామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని ప్రకటించారు.
ముగిసిన అధ్యాయం: ముందుగా పార్టీ నేతల అభిప్రాయాలకు సమాధానం ఇస్తూ కరుణానిధి ప్రసంగించారు. వాజ్ పేయ్ హయంలో బీజేపీతో కలసి పయనించామని, ఆయన తమిళనాడుకు ఎంతో సహకారం అందించారని, ఆ కూటమి వాజ్‌పేయ్‌తోనే ముగిసిందన్నారు. కాంగ్రెస్‌తో ఇక జత కట్టే ప్రసక్తేలేదని తేల్చి చెప్పిన కరుణానిధి అవసరం అయితే, ఒంటరిగానైనా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి, కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టారు. వారసత్వ సమరంలో భాగంగా గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
Advertisement
Advertisement