రండి..రండి!
Published Tue, Feb 18 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. అందరి కన్నా ముందుగా అన్నాడీఎంకే ఎన్నికల పనుల్లో దూసుకెళుతోంది. తమ నేతృత్వంలో బలమైన కూటమి లక్ష్యం గా బీజేపీ పావులు కదుపుతూ వస్తున్నది. తొలుత ఒంటరినంటూ ప్రకటించి, ఆ తర్వాత మనసు మార్చుకున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి మెగా కూటమి లక్ష్యంగా వ్యూహ రచనలో పడ్డారు. కాంగ్రెస్, డీఎండీకేలను కలుపుకోవడం లక్ష్యంగా చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన కరుణానిధి మహా నాడు వేదికగా తన కూటమిని ప్రకటిస్తారని సర్వత్రా ఎదురు చూశారు. తిరుచ్చి వేదికగా రెండు రోజుల పాటుగా జరిగిన మహానాడు కు వీసీకే, పుదియ తమిళగం, ద్రవిడ కళగం, మనిదనేయ మక్కల్ కట్చిల నేతలు తరలి వచ్చారు. తమ ప్రసంగాల్లో ఆయా పార్టీల నేతలెవ్వరూ కేంద్రంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీని టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. అన్నాడీఎంకే తీరును దుయ్యబట్టా రు.కేంద్రంలోని యూపీఏ, ప్రధాన ప్రతి పక్షం డీఎండీకేలపై ఎలాంటి విమర్శలు లేకుండా మహానాడులో ప్రసంగాలు సాగాయి.
చేతులు కలపండి: కూటమి పార్టీల నేతలందరూ ప్రసంగించడంతో చిట్ట చివరగా ఆదివా రం రాత్రి కరుణానిధి ప్రసంగం సాగింది. కూటమి గురించి కరుణానిధి స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. అయితే, తన ప్రసంగం అంతా రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారును తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేందుకు, ఆ ప్రభుత్వానికి కోర్టులు వేసిన అక్షింతల్ని వివరించడానికి ఎక్కువ సమయం కేటాయించారు. తన ప్రసంగంలో కేంద్రంపై ఎలాంటి విమర్శలు ఎక్కు పెట్టక పోవడం, తీర్మానాల్లోను ఇదే తంతు సాగడంతో కాంగ్రెస్‌తో తమ బంధం గట్టిదంటూ పరోక్ష సంకేతాన్ని మహానాడు వేదికగా ఇచ్చా రు. బీజేపీపై విరుచుకు పడుతూ ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని చాటారు. చివర్లో సేతు సముద్రం ప్రాజెక్టులక్ష్యంగా శ్రమిస్తున్న వాళ్లు, మతతత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీలన్నీ తనతో కలసి రావాలని పిలుపు నిచ్చారు. ఆ పార్టీలతో కలసి మెగా కూటమి ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు కరుణానిధి ప్రకటించారు. మహానాడు వేదికగా మతతత్వ వ్యతిరేక పార్టీలకు కరుణానిధి పిలుపు నిచ్చినా, ఆ పార్టీల నుంచి స్పందన ఏ మేరకు వస్తుందో వేచి చూడాల్సిందే.
నిరాశలో స్టాలిన్ మద్దతుదారులు: మహానాడు వేదికగా తమ నేత స్టాలిన్‌కు ప్రమోషన్ ఇస్తారని మద్దతుదారులు ఎదురుచూశారు. అయితే, ఆ ఊసేలేకుండా తన ప్రసంగాన్ని కరుణానిధి ముగించారు. దీంతో వారు నిరాశలో కూరుకుపోయారు. డీఎంకేలో అళగిరి, స్టాలిన్‌ల మధ్య వారసత్వ సమరం గురించి తెలిసిందే. అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దృష్ట్యా, స్టాలిన్ హోదా పెరిగినట్టే. తన వారసుడు స్టాలిన్ అన్న స్పష్టమైన నిర్ణయంతో కరుణానిధి ఉన్నా, అధికారికంగా ప్రకటించడంలో వెనక్కు తగ్గుతున్నారు. తాజా, మహానాడులో స్టాలిన్‌ను మిత్ర పక్షాల నాయకులు పొగడ్తలతో ముంచెత్తారు. డీఎంకేకు తదుపరి రథ సార థి స్టాలిన్ అని, ఆయన సీఎం కావడం తథ్యమని ఆ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల సందర్భంలో మహానాడు పరిసరాల్లో చప్పట్లు, కేరింతలు మార్మోగాయి. అక్కడే ఉన్న కరుణానిధి ఆ వ్యాఖ్యలను వింటూ బయటకు కన్పించని రీతిలో తన మదిలో ఆనందాన్ని నింపుకున్నారట!.
Advertisement
Advertisement