ప్రొఫెసర్‌ లక్ష్మికి ‘ఖాకీ’ కవచం! | doctor sandhya rani suicide case: police to help to professor laxmi | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ లక్ష్మికి ‘ఖాకీ’ కవచం!

Published Fri, Nov 11 2016 11:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

ప్రొఫెసర్‌ లక్ష్మికి ‘ఖాకీ’ కవచం! - Sakshi

ప్రొఫెసర్‌ లక్ష్మికి ‘ఖాకీ’ కవచం!

డాక్టర్‌ సంధ్యారాణి మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్‌ లక్ష్మికి కొందరు పోలీస్‌ ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అరెస్ట్‌ కాకుండా పావులు కదుపుతున్న పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు
సమాచారం ముందుగానే అందుతుండటంతో అప్రమత్తం అవుతున్న ప్రొఫెసర్‌
ఎప్పటికçప్పుడు మకాం మార్చేస్తున్న వైనం
బెయిల్‌ తీసుకున్న తర్వాతే గుంటూరు రావాలని యోచన  


సాక్షి, గుంటూరు: డాక్టర్‌ సంధ్యారాణి మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్‌ లక్ష్మికి కొందరు పోలీస్‌ ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి నుంచి అందుతున్న సమాచారంతోనే ఆమె పోలీసులకు చిక్కకుండా ఎప్పటికçప్పుడు తప్పించుకుంటున్నట్లు సమాచారం. గతంలో గుంటూరులో పనిచేసిన ఓ ఉన్నతాధికారితో పాటు, ప్రొఫెసర్‌ లక్ష్మి భర్తకు సన్నిహితులుగా ఉన్న మరో ఇద్దరు పోలీస్‌ అధికారుల సలహా మేరకే ఆమె పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిరోజే ప్రొఫెసర్‌ లక్ష్మి కోసం ఇంటికి వెళ్లిన పోలీసులతో తన భార్యను అప్పగిస్తానంటూ విజయసారథి నమ్మబలకడంతో ఆయన్ని వదిలేశారు. అయితే విజయసారథి మరుసటి రోజు భార్యతో సహా ఇతర రాష్ట్రాలకు పరారయ్యాడు. అప్పట్నుంచి పోలీసు బృందాలు ప్రొఫెసర్‌ లక్ష్మి దంపతుల కోసం గాలిస్తూనే ఉన్నాయి.

మరోవైపు ప్రొఫెసర్‌ లక్ష్మి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. కానీ ఎన్ని రోజులైనా పరారీలో ఉండి.. బెయిల్‌ తీసుకున్న తర్వాతే గుంటూరు రావాలనే యోచనలో లక్ష్మి దంపతులు ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఇటీవల గుంటూరులోని ఆమె ఇంటితో పాటు ఆసుపత్రిలో పోలీసులు తనిఖీలు చేయగా డైరీలు లభ్యమయ్యాయి. ఇందులో ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో వారు సెల్‌ఫోన్, ఏటీఎం కార్డులను కూడా వాడకుండా పక్కన పడేశారు. దీంతో వీరి ఆచూకీ కనుగొనడం పోలీసులకు సమస్యగా మారింది.

సొంత వారే సహకరిస్తుండటంతో..
తొలుత ఈ కేసుకు నగరంపాలెం సీఐ మొహమ్మద్‌ హుస్సేన్‌ దర్యాప్తు అధికారిగా వ్యవహరించగా, ఆయన్ని తొలగించి గుంటూరు వెస్ట్‌ డీఎస్పీ సరితకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. అయినా సొంత డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారే సహకరిస్తుండటంతో ప్రొఫెసర్‌ లక్ష్మి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమవుతున్నారు. కాగా, ప్రొఫెసర్‌ లక్షి్మకి సహకరించిన వారు కూడా శిక్షార్హులవుతారంటూ డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర తేల్చి వారిపై చర్యలు చేపడతారా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నోట్ల రద్దుతో వెనక్కి వస్తున్న పోలీసు బృందాలు
దేశవ్యాప్తంగా రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పాటు, బుధ, గురువారాల్లో ఏటీఎంలు మూసివేయడంతో ప్రొఫెసర్‌ లక్ష్మి కోసం గాలించేందుకు వెళ్లిన పోలీసు బృందాలు డబ్బుల్లేక వెనక్కి వస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వీరు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement