విశ్వవిద్యాలయాల్లో భయానక వాతావరణం ప్రమాదకరం
నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో భయానక వాతావరణం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శనాత్మక ప్రసంగాలు చేసే ప్రొఫెసర్లు తదితరులపై చర్యలు తీసుకోవడం సమకాలీన భారత్‌లో స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తాను రచించిన ‘సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్యనిర్వాహక హక్కులు ఉన్నంత మాత్రానా ప్రభుత్వమే అన్నీ తానై వ్యవహరించరాదని సూచించారు. విధాన రూపకల్పనల్లో సమానత్వం కోసం చేయాల్సిన ప్రయత్నాలు నీరుగారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నారని, దీని వల్ల సోదరభావం పెంపొందించడం అవరోధంగా మారిందన్నారు. ఆరోగ్యరంగం వృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. చైనా తన జీడీపీలో 2 శాతం ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తుంటే భారత్‌లో మాత్రం 1 శాతం కన్నా తక్కువ వెచ్చిస్తున్నారని ఆమర్త్యసేన్ తెలిపారు.