బతకమని ఇచ్చి.. లాక్కుంటారా..?
బతకమని ఇచ్చి.. లాక్కుంటారా..?
Published Tue, Feb 7 2017 3:53 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
దళితులకిచ్చిన భూముల్లో ‘డబుల్’ నిర్మాణాలు
మా భూములు మాకే ఇవ్వాలని డిమాండ్
హుస్నాబాద్: 25 ఏళ్ల క్రితం భూమి లేని నిరుపేద దళితులకు వ్యవసాయం చేసుకొమ్మని భూమి, పట్టాలిచ్చిన అధికారులు నేడు ఆ భూముల్లోనే డబుల్ బెడ్‌రూంలను కట్టడంపట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. హుస్నాబాద్ పట్టణానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 160 మంది లబ్ధిదారులకు ఈనెల 8న మంత్రి హరీశ్‌రావు ‘డబుల్’ ఇండ్లు నిర్మించేందుకు శిలాఫలకం సైతం రెడీ చేయడంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం సెంటు భూమి లేని ఏడుగురు దళితులకు ఎకరం చొప్పున ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. రాళ్లు, రప్పలతో ఉన్న ఈ భూములను సాగులోకి తెచ్చేందుకు దళితులు వేల రూపాయలు ఖర్చు పెట్టారు. నాలుగైదు ఏళ్ల నుంచి పత్తి, జొన్న పంటను వేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా ఇటీవల ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణానికి మొదటిద«శలో 160 డబుల్ బెడ్‌రూంలను మంజూరు చేసింది. పట్టణంలో సర్కార్ భూమి లేకపోవడంతో అధికారులు ప్రభుత్వం దళితులచ్చిన భూమిపై కన్నేసింది.
ప్రభుత్వం ఇచ్చిన భూములను ఎందుకు సాగు చేసుకోవడం లేదని సంజాయిషీ ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం లబ్ధిదారులైన దళితులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ స్థలంలోనే డబుల్ బెడ్‌రూంలను నిర్మిస్తున్నారనే సమాచారం దళితులకు తెలవడంతో ఇదేక్కడి ఆందోళన చెందుతున్నారు. తమకు బతుకుమని ఇచ్చి భూములను గుంజుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దళితులకు ఇచ్చిన భూముల్లోనే డబుల్ బెడ్‌రూంలను నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి డబుల్ బెడ్‌రూంలు నిర్మిస్తున్న భూమిలో ఇళ్లు కట్టి తమకు అన్యాయం చేయొద్దని, తమ భూమి తమకే ఇవ్వాలని దళితులు అంటుంటే.. గుట్టల్లో ఇండ్లు కట్టవద్దని పేదలు కోరుతున్నారు. దళితులకు ప్రత్యామ్నాయంగా భూమిని ఇచ్చి.. ఇండ్లు కడతారా..? లేక లబ్ధిదారుల కోరిక మేరకు మరోచోట డబుల్ బెడ్‌రూంలను కట్టిస్తారా..? వేచి చూడాల్సిందే.
మాకు అన్యాయం చేయవద్దు..
ఏన్నో ఏళ్ల క్రితం గుట్టల్లో వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం పట్టాలిచ్చింది. శక్తి మేరకు గుట్టలు, రాళ్లున్న భూములను చదును చేసుకున్నాం. ఇప్పుడేమో మాకెవ్వరికీ తెలువకుండానే ఇచ్చిన భూములను లాక్కోవడం అన్యాయం. మా భూమి మాకు ఇవ్వాలి.. లేదంటే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇవ్వాలి.
– ఖాతా అనందం
Advertisement