*మద్యం మత్తులో పట్టపగలే హల్‌చల్ చేసిన నటి మాధురి, ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా
* పోలీసుల అదుపులో ఐదుగురు
*కేసు నమోదు చేస్తామన్న డీసీపీ పాటిల్
బెంగళూరు, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో నడిరోడ్డుపై పట్టపగలే ఓ నటి, ఫ్యాషన్ డిజైనర్‌తో సహా ఐదుగురు న్యూసెన్స్ సృష్టించారు. సంఘటనకు సంబంధించి స్థానికుల ఫిర్యాదు మేరకు వారిని మల్లేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలను మీడియా సమావేశంలో ఉత్తర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ శుక్రవారం వెల్లడించారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, శ్యాండిల్‌వుడ్ నటి మాధురి(ర్యాంబో ఫేం)తో సహా ఐదుగురు గురువారం ఉదయం 8.30గంటలకు మల్లేశ్వరం 17వ క్రాస్‌లోని వీణా స్టోర్స్ వద్దకు విలాసవంతమైన కారు (కేఏ 05 ఎన్‌కే 7275)లో చేరుకున్నారు. అనంతరం కారు ముందుకు చేరుకుని బీరు బాటిల్స్ చేతిలో పట్టుకుని తాగారు. ఆ సమయంలో వారిని స్థానికులు నిలదీయడంతో రమేష్ దిమ్లా రెచ్చిపోయాడు.
షర్ట్ తీసి రోడ్డుపై గిరాటేసి, ప్యాంట్‌ను మోకాళ్ల వరకు ఎత్తి చూసుకుందాం రండని సవాల్ విసిరాడు. అర్ధనగ్న దుస్తులు వేసుకున్న మాధురి, మరో యువతి అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో మహిళలు తలలు దించుకుని వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించారు. వీరి ప్రవర్తన విషమిస్తుండడంతో సహనం కోల్పోయిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో మల్లేశ్వరం పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కొందరు రాజకీయ పెద్దలు జోక్యం చేసుకుని వారిని వదిలిపెట్టాలంటూ పోలీస్ అధికారులపై ఒత్తిడి పెంచారు.
శుక్రవారం ఉదయం ఆ సన్నివేశాలను కొన్ని టీవీ చానెల్స్ ప్రసారం చేయడంతో విషయం వెలుగు చూసింది. తమ అదుపులో ఉన్న ఐదుగురిని మల్లేశ్వరం జనరల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని, వారిలో కొందరు మద్యం సేవించినట్లు వైద్య నివేదికలో వెలుగు చూసిందని డీసీపీ తెలిపారు. కాగా, వారిని వదిలిపెట్టాలంటూ తమపై ఎలాంటి ఒత్తిడులు లేవని, కేసు నమోదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తప్పతాగి రోడ్డుపై సినీతార రచ్చ రచ్చ
Published Sat, Nov 30 2013 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement