డ్రంకెన్ డ్రైవింగ్‌పై సమరభేరి
Published Fri, Aug 30 2013 1:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
న్యూఢిల్లీ: నగరంలో డ్రంకెన్ డ్రైవ్‌కు సంబంధించిన రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. మద్యం పుచ్చుకున్న అనంతరం ఓ యువకుడు కారులో ఇటీవల జాయ్‌రైడ్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై చనిపోయిన సంగతి విదితమే. అదే కారులో ఆ సమయంలో అతని వెంట ఉన్న నలుగురు స్నేహితులు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. మరుసటిరోజు ఉదయం అతగాడి శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమనే విషయాన్ని తెలియజేసేందుకుగాను నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నడుం బిగించింది. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని 2000వ సంవత్సరంనుంచి క్యాంపైన్ ఎగనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ (సీఏడీడీ) అనే సంస్థ... తాజాగా వలంటీర్ ఫర్ చేంజ్ క్యాంపయిన్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మద్యం సేవించి వాహనాలను నడిపితే కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. నగరానికి చెందిన దాదాపు పదివేల మంది యువకులు ఇందులో పాలుపంచుకోనున్నారు. ఈ విషయమై సీఏడీడీ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యువత చురుగ్గా పాలుపంచుకునేవిధంగా చేసేదిశగా కొంతకాలంగా ఆలోచిస్తున్నామన్నారు. నగరంలో యువజనుల సంఖ్య బాగానే ఉందని, అదే సమయంలో పబ్‌ల సంఖ్య కూడా బాగానే ఉందని అన్నారు. ప్రస్తుత యువతరం ఎంతో చురుగ్గా ఉందని, సమాజంతో సంబంధాలను కొనసాగిస్తోందన్నారు. అందువల్ల డ్రంకెన్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా తాము చేపడుతున్న కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరామన్నారు. ఔత్సాహిక యువకులు ఏడాదికి 20 నుంచి 50 గంటల సమయాన్ని ఇందుకోసం కేటాయించాలని కోరామన్నారు.
నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యూఏ), బాధితులను కలసి వారితో చర్చలు జరుపుతారని, అంతేకాకుండా సంబంధిత పోలీసు అధికారులను కూడా సంప్రదిస్తారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కలిగే అనర్థాలను వారికి వివరిస్తారన్నారు.
పోస్టర్లతోనూ ప్రచారం
మద్యం సేవించి వాహనాలను నడిపితే కలిగే అనర్థాలపై సీఏడీడీ సంస్థ పోస్టర్లతోనూ ప్రచారం నిర్వహించనుంది. బహిరంగ ప్రదేశాలు ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఆయా గోడలకు అతికించనుంది. ఆ కరపత్రం ఇలా ఉంటుంది. ‘కార్లకు దొరికినంత తేలిగ్గా మనుషులకు అసలైన విడిభాగాలు లభించవు’ అని దానిపై రాస్తారు.
Advertisement