డ్రంకెన్ డ్రైవింగ్‌పై ఉక్కుపాదం | 111 drivers lose driving licenses for drunk driving in New Delhi | Sakshi
Sakshi News home page

డ్రంకెన్ డ్రైవింగ్‌పై ఉక్కుపాదం

Published Tue, Oct 21 2014 10:53 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

111 drivers lose driving licenses for drunk driving in New Delhi

 ‘రోడ్లపై మద్యం తాగి వాహనాలు నడిపితే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అంతేకాదు, వారి చర్యల కారణంగా జనసమర్ధమై రాజధాని నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతాయి..ఎంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ‘తాగి వాహనాలు నడపరాదనేది అత్యంత ముఖ్యమైన ట్రాఫిక్ నిబంధన. దీన్ని ఉల్లంఘించడం నేరం. మద్యం తాగి వాహనాలు నడిపితే భవిష్యత్‌లో వారి ప్రాణాలతోపాటు రోడ్లపై ఇతరుల ప్రాణాలకు ముప్పు జరుగుతుంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలెన్నో నగరంలో నమోదు అయ్యాయి. దీన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఎవరైనా మద్యం తాగి రోడ్డెక్కి పట్టుబడితే వారి లెసైన్సుల రద్దు, ఇంకా వారి చర్యల తీవ్రత కారణంగా ఇంకేవరికైనా అపాయం జరిగితే అందుకు అనుగుణంగా కఠిన చర్యలుంటాయి. తాగి రోడ్డెక్కితే... తస్మాత్ జాగ్రత్త అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది’.
 
 న్యూఢిల్లీ: నగరంలో డ్రంకన్ డ్రైవర్లపై ఢిల్లీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన 111 మంది డ్రైవర్ల లెసైన్స్‌లను ఈ ఏడాది రద్దు చేసింది. ఇందులో 89 మంది సాధారణ వాహనాల డ్రైవర్లతోపాటు 22 మంది వాణిజ్య వాహనాల డ్రైవర్ల లెసైన్సులను రద్దు చేసింది. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఈ మేరకు వారి లెసైన్సులను రద్దు చేసినట్లు రవాణా విభాగానికి చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నారు. నగర రోడ్లపై ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా ఈ డ్రైవర్లు వ్యవహరించారని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగి అవకాశాలు ఉన్నాయని, వారి ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని జరుగుతుందని అన్నారు.
 
 మద్యం తాగి డ్రైవింగ్‌కు పాల్పడినట్లు ఒకటి లేదా రెండు సార్లు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన డ్రైవర్లను గుర్తించి లెసైన్సులు రద్దు చేసినట్లు చెప్పారు.  డ్రంకెన్ డ్రెవ్‌కు పాల్పడిన మరో 25 మందిపై కూడా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు రవాణా విభాగానికి జాబితాను అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు డ్రంకెన్ డ్రైవింగ్‌కు పాల్పడిన 25 మందికి తక్షణమే సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వారు సరైన కారణాలు తెలియజేయకుంటే డ్రైవింగ్ లెసైన్సులను తాత్కాలికంగా లేదా పూర్తిగా రద్దు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో  ట్రాన్స్‌పోర్టు విభాగం 699 మంది డ్రైవర్ల లెసైన్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పారు. వీరంతా మద్యం తాగి డ్రైవింగ్ చేసినట్లు గుర్తించామని చెప్పారు.
 
 ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు
 న్యూఢిల్లీ: నగరంలో వాహనాలను సురక్షితంగా నడిపి డ్రైవర్లను ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి ప్రమాదరికార్డులేని 232 మంది డ్రైవర్లను సన్మానించింది. మంగళవారం డీటీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ స్పోలియా  ఉత్తమ డ్రైవర్లకు అవార్డులను అందజేశారు. 2013 సంవత్సరంలో ఎలాంటి ప్రమాద రికార్డు లేని డ్రైవర్లను ఉత్తమ డ్రైవర్లుగా ఎంపిక చేశారు. వీరికి అవార్డుతోపాటు ఒక్కొక్కరికి రూ. 5,000 నగదు పురస్కారాన్ని డీటీసీ అందజేసింది. మొత్తం 232 మంది ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేశారు. వీరిలో డీటీసీ పశ్చిమ ప్రాంతంలో పనిచేసిన 72 మంది, ఉత్తర ప్రాంతంలో పనిచేసిన 45 మందికి, అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో 27 మంది, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసిన 26 మందికి ఉత్తమ అవార్డులు అందజేసినట్లు డీటీసీ అధికార ప్రతినిధి ఆర్‌ఎస్ మిన్‌హాస్ తెలిపారు. అదేవిధంగా అంతర్గత త్రైమాసిక పత్రికను ఆవిష్కరించినట్లు చెప్పారు. ఈ కార్యమానికి రవాణాశాఖ కమిషనర్ జ్ఞానేష్ భారతి, డీటీసీ సీఎండీ దేబశ్రీ ముఖర్జి హాజరయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement