దుర్గా పందిళ్లకు ద్రవ్యోల్బణం పోటు
Published Wed, Oct 2 2013 12:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
సాక్షి, న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం ప్రభావం నగరంలోని దుర్గా పూజా పందిళ్లపై కూడా కనిపిస్తోంది. నగరంలో ఎప్పటి మాదిరిగానే దసరా సందర్భంగా దుర్గా పూజ వేడుకలు నిర్వహించడానికి విభిన్న దుర్గా పూజా సమితులు గత రెండు నెలలుగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే ఐదు రోజుల ఉత్సవాల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయని పూజా సమితులు చెబుతున్నాయి. రాజధాని నగరంలో బెంగాలీలు అధికంగా ఉండటంతో ఇక్కడ కూడా దుర్గా పూజోత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తారు. విభిన్న ఇతివృత్తాలతో విగ్రహాల తయారీ, పందిళ్ల రూపకల్పనతో పాటు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో పాటు భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా గ్లామర్‌తో పాటు వైభవాన్ని, భక్తిని మేళవించి వైభవంగా జరుపుకునే దుర్గా పూజా వేడుకలపై ఈసారి ద్రవ్యోల్బణం ప్రభావం పడింది.
ఆర్థిక మాంద్యం కారణంగా సమితులకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే కార్పొరోట్ సంస్థలు చిన్న మొత్తాలతోనే ఈసారి సరిపెట్టాయి. మరోవైపు దుర్గా పూజ నిర్వహణ ఖర్చు మూడింతలు పెరిగింది. దీంతో దుర్గాపూజ సమితులు తమ బడ్జెట్‌లను కుదించి ఖర్చులకు కోత విధించకతప్పడం లేదు. ఖర్చులు పెరిగిన కారణంగా ఇదివరలో మాదిరిగా ఈ ఉత్సవాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ల నుంచి సుప్రసిద్ధ కళాకారులను రప్పించడం లేదని పూజా సమితి సభ్యులు చెబుతున్నారు.
పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఇంధనం చార్జీలు, కరెంటు చార్జీలు, కూలీ రేట్లు, పళ్లు, కూరగాయల ధరలు పెరగడంతో ఐదు రోజుల ఉత్సవాని కయ్యే ఖర్చుకు పరిమితులు విధించకతప్పడం లేదని వారు అంటున్నారు. సందర్శకుల వినోదం కోసం ప్రతి సంవత్సరం పశ్చిమ బెంగాల్ నుంచి కళాకారులను విమానంలో రప్పించేవారమని కానీ ఈ యేడాది స్థానిక కళాకారులతోనే కార్యక్రమాలను రూపొందించామని గ్రేటర్ కైలాష్ పార్ట్-2లో దుర్గోత్సవ్ వేడుక నిర్వహించే పూజా సమితి సభ్యుడు చెప్పారు. ఈ పూజా సమితి గడిచిన 22 సంవత్సరాలుగా గ్రేటర్ కైలాష్‌లో దుర్గాపూజా వేడుకలను నిర్వహిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ఈ సంవత్సరం బడ్జెట్‌ను అదుపులో పెడుతున్నామని, డోలు వాయించే ఢాఖీల సంఖ్యను కూడా తగ్గించామని ఆయన చెప్పారు. ప్రతిసంవత్సరం ఏదో ఒక ఇతివృత్తంతో పూజా పందిరి వేసేవారమని, కానీ ఈ సంవత్సరం ఇదివృత్తం లేకుండా నిరాడంబరంగా పండల్ రూపొందిస్తున్నామని పుష్పవిహార్ ఎంబీ రోడ్ పూజాసమితి అధ్యక్షుడు చెప్పారు.
కశ్మీరీగేట్ ప్రాంతంలో గత 104 సంవత్స రాలుగా ఇక్కడ పండల్ ఏర్పాటు చేస్తున్నారు. పండల్ వద్ద భోజనశాలలు కూడా నిర్వహిస్తారు. ఇంకా సీఆర్ పార్క్, మయూర్ విహార్‌లో మిలన్ పూజా కమిటీ, సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో ఉత్సవాలు భారీగా నిర్వహిస్తారు.
Advertisement
Advertisement