సాక్షి, ముంబై: సందర్శకులకు శుభవార్త. మంత్రాలయ ప్రవేశాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలంటూ సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ఆదేశించారు. మంత్రాలయలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, సంబంధిత శాఖ మంత్రులతో భేటీ అయ్యేందుకు నిత్యం ముంబైకర్లతోపాటు రాష్ట్రం నలుమూల నుంచి వందలాది సామాన్యులు వస్తుంటారు. ఇలా వచ్చిన వారంతా గంటల కొద్దీ క్యూలో నిలబడతారు.
మధ్యాహ్నం రెండు గంటల తరువాత సంబంధిత అధికారులు ఒక్కొక్కరినీ లోపలికి అనుమతిస్తారు. అంతకు ముందు ప్రవేశం పొందేందుకు కౌంటర్ వద్ద గుర్తింపు కార్డు చూపించి ‘ఎంట్రీ పాస్’ తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి పంపించే సమయంలో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తతంగ మంతా పూర్తయ్యేసరికి సందర్శకుడు తాను కలుసుకోవాలనుకున్న అధికారి లేదా మంత్రి ఉంటారనే నమ్మకం లేదు. ఒకవేళ వారు లేరంటే మళ్లీ మంత్రాలయకు మరోరోజు రావాల్సి ఉంటుంది. ఇక నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం నాగపూర్‌లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాలు పూర్తికాగానే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టునున్నారు. ఇందుకు హోం శాఖ, ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) అధికారులు సమాచార,సాంకేతిక విభాగాలతో చర్చలు జరపనున్నారు. మంత్రాలయ భవనానికి సమీపంలో ఉన్న వాంఖేడే స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేవలం 20 నిమిషాల్లో దాదాపు 50 వేల మందికి తనిఖీలు నిర్వహించి స్టేడియంలోకి పంపిస్తారు.
మంత్రాలయకు పంపించే సందర్శకులకు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలనే అంశం తెరపైకి వచ్చిందని సాంకేతిక,సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ తెలిపారు. త్వరలో సాధ్యసాధ్యాలను పరిశీలించి స్టేడియంలో అవలంభించే భద్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
తీసుకోనున్న చర్యలివే...
ప్రవేశ ద్వారాల సంఖ్య పెంపు అత్యాధునిక తనిఖీ వ్యవస్థ
మహిళలు, సీనియర్ సిటిజన్లకు వెంటనే ప్రవేశం
ప్రవేశం మరింత సులభం
Published Mon, Dec 22 2014 10:15 PM | Last Updated on Tue, Oct 9 2018 3:56 PM
Advertisement