బిస్కెట్లు తింటే నిలువు దోపిడే!
Published Tue, Feb 25 2014 10:40 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
న్యూఢిల్లీ:విదేశాల నుంచి నెల క్రితం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ఒక ఇంజనీర్ ట్యాక్సీ తీసుకొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాన్పూర్ వెళ్లే రైలు కోసం ప్లాట్‌ఫారంపై ఎదురుచూస్తూ కూర్చున్నారు. కాసేపటికి సహా ప్రయాణికుడిలా వచ్చిన వ్యక్తి ఇతనితో మాటలు కలిపాడు. తాగండంటూ టీ ఇచ్చాడు. టీ తాగిన ఇంజనీర్ కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చాక చూసుకుంటే తన దగ్గరున్న విలువైన వస్తువులన్నీ మాయమైనట్టు బాధితుడు గుర్తించాడు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్లలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. జెహర్ ఖురానీ వంటి పలు ముఠాలు ఢిల్లీ నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణికులకు మత్తుమందులు ఇచ్చి తరచూ దోపిడీలకు పాల్పడుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో ఇలాంటివి జరుగుతుండడంతో ఢిల్లీ పోలీసుశాఖ అప్రమత్తమయింది. ఢిల్లీకి వలస వచ్చే పొరుగు రాష్ట్రాలవాసుల్లో చాలా మందికి హిందీ రాదు కాబట్టి నేరాలపై వారి మాతృభాషలోనే అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తోంది.
నేరాల నిరోధానికి తాము చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరికీ చేరాలని కోరుకుంటోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లు, బస్టాపుల వంటి రద్దీ ప్రదేశాల్లో మత్తుమందుల రవాణా, దోపిడీ ముఠాల బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి తీసుకోవడానికి చర్యల గురించి రైల్వేస్టేషన్లలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాజధానిలో బీహార్, యూపీవాసుల సంఖ్య అధికం కాబట్టి వారి కోసం భోజ్‌పురి భాషలోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ‘యాత్రిజన్ సె అనురోధ్ బా, కోయీ సే జల్డీ దోస్తీ నా కరే, న కెహు కె దెహల్ ఖయీన్’ (అపరిచితులతో చనువుగా వ్యవహరించవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వారి నుంచి ఆహార పదార్థాలు స్వీకరించవద్దు) అంటూ భోజ్‌పురి భాషలో సాగే సందేశం ఆనంద్‌విహార్ రైల్వే స్టేషన్‌లో తరచూ వినిపిస్తోంది.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే చాలా రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయి కాబట్టి భోజ్‌పురి భాషలో ప్రచారం చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం ఈ ముఠా సభ్యులు టికెట్ కౌంటర్లు లేదా రైళ్లలో సహప్రయాణికులతో స్నేహంగా మెలుగుతారు. హిందీ, భోజ్‌పురి లేదా బెంగాలీలో మాట్లాడి వారితో చనువు పెంచుకుంటారు. కాసేపు ఆగిన తరువాత వారికి మత్తుమందు కలిపిన బిస్కెట్లు, చాయ్ లేదా కూల్‌డ్రింకులు ఇస్తారు. బాధితులు స్పృహ కోల్పోగానే వారి దగ్గరున్న విలువైన వస్తువులన్నింటినీ తీసుకొని మాయమవుతారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో మత్తుమందులు ఇవ్వడం కీలకమైన దని, తేలిగ్గా ఎవరు లొంగుతారో ఈ ముఠాలకు బాగా తెలుస్తుందని రైల్వేశాఖ డీసీపీ సంజయ్ భాటియా తెలిపారు. ‘వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులకు మా ప్రచారం చేరేందుకు వీలుగా భోజ్‌పురి భాషలోనూ ప్రచారం చేస్తున్నాం.
బెంగాలీలోనూ ఎనౌన్స్‌మెంట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆనంద్‌విహార్ రైల్వే స్టేషన్‌లో ప్రతి అరగంటకు ఒకసారి ప్రకటనలు ఇస్తున్నాం. మిగతా స్టేషన్లలోనూ త్వరలోనే ప్రకటనలు ఇస్తాం’ అని ఆయన వివరించారు. ఇలా రైళ్లలో ప్రయాణికులను మోసగిస్తూ గత ఐదేళ్లలో 101 మంది పోలీసులకు చిక్కారు. వీరి నేరాలశైలిని వివరిస్తూ పుస్తకాలు రూపొందించిన పోలీసులు.. వాటిని రైల్వే ఉద్యోగులు, సిబ్బందికి కూడా పంచిపెట్టారు. దొంగల ముఠాల కార్యకలాపాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాల్సిందిగా ఉద్యోగులందరికీ సూచించామని భాటియా అన్నారు. అపరిచితుల నుంచి తినుబండారాలు తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. నేరగాళ్ల ఆటకట్టించడానికి తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Advertisement
Advertisement