న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల కమిషన్(ఈసీ) తీపి కబురును అందించింది. తాము ఏ పార్టీ నేతకు ఓటు వేశామో చూసుకునే వెసులుబాటును కల్పించింది.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల కమిషన్(ఈసీ) తీపి కబురును అందించింది. తాము ఏ పార్టీ నేతకు ఓటు వేశామో చూసుకునే వెసులుబాటును కల్పించింది. వరుస సంఖ్య, అభ్యర్థి పేరు, గుర్తులతో కూడిన పేపర్ స్లిప్ వీరు ప్రత్యక్షంగా చూసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటర్స్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)ను వినియోగిస్తున్నామని ఈసీ ఆదివారం ప్రకటించింది. ‘నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే వీవీపీఏటీ వ్యవస్థను ఉపయోగించాం. ఓటింగ్ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు తొలిసారిగా ఢిల్లీ ఎన్నికల్లో వినియోగించనున్నామ’ని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్ శుక్లా మీడియాకు తెలిపారు. ఢిల్లీవాసుల కోసం తొలిసారిగా చేపడుతున్న ఈ వీవీపీఏటీని కేవలం న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తున్నామని వివరించారు.
ఓటింగ్ యంత్రానికి చెందిన బ్యాలెట్ విభాగానికి ప్రింటర్‌ను అనుసంధానం చేస్తామన్నారు. అభ్యర్థి పేరు, గుర్తుకు వ్యతిరేకంగా ఉన్న బటన్‌ను ఓటర్ నొక్కితే సీరియల్ నంబర్, పేరు, గుర్తు ప్రింట్ రూపంలో వస్తుందన్నారు. అప్పుడు వారు ఎవరికీ ఓటు వేశారనేది ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుందని వివరించారు. ప్రింటర్‌పై ఉన్న గ్లాస్‌ను కవర్ చేసేలా ఉన్న విండో ద్వారా ఏడు సెకన్ల పాటు ఈ పేపర్ స్లిప్‌ను చూసుకోవచ్చన్నారు. దీనివల్ల ప్రజలకు తాము ఓటు సరిగానే వినియోగించుకున్నామనే సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. వీవీపీఏటీ వ్యవస్థ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు న్యూఢిల్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో డమ్మీ పొలింగ్ నిర్వహిస్తామని శుక్లా వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో 1,24,032 మంది ఓటర్లున్నారని వివరించారు. కాగా ఈ నియో జకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, విజేంద్ర గుప్తాలు బరిలో ఉన్నారు.