
అయ్యో పాపం..!
► తాగునీటి కోసం వచ్చి బురదలో చిక్కుకున్న ఏనుగు
సేలం: అడవుల్లో ఉండే ఏనుగులు ఆహారం, తాగునీటి కోసం వెలుపలికి వస్తుంటాయి. ఈ క్రమంలో తమిళనాడులోని సత్యమంగళం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఒక ఆడ ఏనుగు బురదలో చిక్కుకుంది. అటవీ శాఖ అధికారులు నాలుగు గంటల పాటు శ్రమించి బయటికి తీశారు. వివరాలు.. ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల శరణాలయం, భవానీసాగర్ అటవీ రేంజ్, విలాముండి అటవీ ప్రాంతం నుంచి నీటి కోసం శుక్రవారం ఏనుగుల గుంపు భవానీసాగర్ నీటి పరివాహక ప్రాంతంలోని నడుమేడు వద్దకు వచ్చింది.
ఆ సమయంలో దాదాపు 15 ఏళ్ల ఓ ఆడ ఏనుగు బురదలో చిక్కుకుంది. దానితో పాటు వచ్చిన ఏనుగులు ఆ ఏనుగును బురదలో నుంచి బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించి వీలుకాక అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయాయి. అదే ప్రాంతంలో వ్యవసాయం పనులు చేస్తున్న చిత్తన్‌కుట్ట, జేజేనగర్ ప్రజలు బురదలో ఏనుగు చిక్కుకున్న విషయాన్ని భవానీసాగర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రేంజర్ నేతృత్వంలో సిబ్బంది 30 మందికి పైగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడున్న ప్రజల సహకారంతో బురదలో చిక్కుకున్న ఆడ ఏనుగును బయటకు తీశారు. అయితే ఎండ వేడి వల్ల నీరసించిన ఆ ఏనుగు లేచి నిలబడలేకపోవడంతో అధికారులు దానిపై నీళ్లు చల్లారు. తర్వాత కొంత సేపటికి ఆ ఏనుగు తేరుకుని భవానీసాగర్ తీరంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.