ఇద్దరు కృష్ణులు.. | Ended the war between the nandamuri brothers | Sakshi
Sakshi News home page

ఇద్దరు కృష్ణులు..

Published Thu, Apr 10 2014 2:12 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

ఇద్దరు కృష్ణులు.. - Sakshi

ఇద్దరు కృష్ణులు..

  •  హిందూపురం శాసనసభ అభ్యర్థిత్వం కోసం నందమూరి బ్రదర్స్ పట్టు
  •  తనకంటే తనకు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి
  •  హిందూపురం అభ్యర్థిగా ఇప్పటికే బాలకృష్ణ పేరు అనధికారికంగా ఖరారు
  •  హరికృష్ణ ఒత్తిడితో తొలి జాబితాలో బాలకృష్ణ పేరును ప్రకటించని వైనం
  •  సాక్షి ప్రతినిధి, అనంతపురం : నందమూరి బ్రదర్స్ మధ్య మరో యుద్ధానికి తెరలేచింది. హిందూపురం శాసనసభ స్థానం కోసం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు తనయులు హరికృష్ణ, బాలకృష్ణ తీవ్రంగా పోటీ పడుతున్నారు. తనను అభ్యర్థిగా ఖరారు చేయాలంటే.. తనను ఖరారు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

    హిందూపురం నుంచి 1985, 89, 94 ఎన్నికల్లో పోటీచేసిన ఎన్‌టీ రామారావు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1989 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్ చేతిలో ఎన్‌టీ రామావు ఓడిపోయినా.. హిందూపురం ప్రజలు అండగా నిలిచి గెలిపించారు. అందుకే హిందూపురం శాసనసభ స్థానంపై ఎన్టీఆర్ మక్కువ పెంచుకున్నారు. ఎన్టీఆర్ మరణించాక 1997 ఉప ఎన్నికల్లో హరికృష్ణ హిందూపురం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

    సెంటిమెంటుగా తమ కుటుంబానికి కలిసి వస్తోన్న హిందూపురం శాసనసభ స్థానం నుంచే రాజకీయ అరంగేట్రం చేయాలని బాలకృష్ణ పట్టుదలతో ఉన్నారు. బాలకృష్ణ ఇటీవల నటించిన ‘లెజెండ్’ సినిమా హిట్ అయ్యింది. ఆ సినిమా విజయయాత్రలో బాలకృష్ణ పలు ప్రాంతాల్లో మాట్లాడుతూ ‘నా అభిమానులు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు’ అని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆ క్రమంలోనే కర్నూల్‌లో ఈ నెల 4న మాట్లాడుతూ హిందూపురం నుంచి శాసనసభకు పోటీచేస్తానని ప్రకటించారు. ఇది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులో వణకు పుట్టించింది.  
     
    చెక్ పెట్టేందుకు చంద్రబాబు విఫలయత్నం
     
    బాలయ్య తనకు అడ్డొస్తాడనే ఉద్దేశంతో ‘స్థానిక’ నేతల సహకారంతో ఆదిలోనే పొగ పెట్టేందుకు యత్నించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్నికైన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని అని.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురం నుంచి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మైనార్టీలు ఆగ్రహించే అవకాశం ఉందంటూ బాలకృష్ణకు చంద్రబాబు చెప్పిచూశారు.

    కానీ.. బాలయ్య వెనక్కి తగ్గలేదు. దాంతో.. అబ్దుల్‌ఘనిని బాలకృష్ణపైకి చంద్రబాబు ఎగదోశారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే అబ్దుల్‌ఘని తన అనునాయులతో ‘టీడీపీలో మైనార్టీలకు స్థానం ఎక్కడ?’ అనే పేరుతో కరపత్రాలు ముద్రింపజేసి.. ఈ నెల 4న బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తోన్న సందర్భంలో వాటిని పంపిణీ చేయించడం కలకలం రేపింది.

    పనిలో పనిగా బాలయ్య స్థానికేతరుడన్న వివాదాన్ని కూడా ‘స్థానిక’ నేతల ద్వారానే చంద్రబాబు తెరపైకి తెచ్చారనే అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు బలంగా వ్యక్తం చేస్తున్నాయి. బాలయ్య హిందూపురంలో పర్యటించేందుకు సరిగ్గా 24 గంటల ముందు మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు మినహా తక్కిన టీడీపీ నేతలు సమావేశమై హిందూపురం నుంచి స్థానికులకే అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కాదూ కూడదని బాలకృష్ణను పోటీకి దింపితే.. తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ అధిష్టానానికి లేఖలు రాశారు.

    ఆ మేరకు కరపత్రాలను ముద్రించి.. బాలయ్య హిందూపురంలో పర్యటిస్తోన్నప్పుడు వాటిని పంపిణీ చేశారు. తన అభిమానుల ద్వారా ఈ అంశాన్ని పసిగట్టిన బాలయ్య.. ఇదే అంశంపై నేరుగా చంద్రబాబును నిలదీసినట్లు సమాచారం. కానీ.. ఆ విషయం తనకు తెలియదని, హిందూపురం అభ్యర్థిగా నీ పేరును ఖరారు చేస్తున్నానని బాలయ్యకు చంద్రబాబు వివరించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
     
    హరికృష్ణ రంగ ప్రవేశంతో..

    ఇన్నాళ్లూ చంద్రబాబుతో విభేదించిన హరికృష్ణ ఇటీవల మళ్లీ సర్దుకున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో తనకు హిందూపురం శాసనసభ టికెట్ ఇవ్వాలని చంద్రబాబుపై హరికృష్ణ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం చంద్రబాబుతో హరికృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరు ఉన్న కృష్ణాజిల్లా గుడివాడ నుంచి శాసనసభకు పోటీచేయాలన్న చంద్రబాబు సూచనను హరికృష్ణ సున్నితంగా తోసిపుచ్చారు.

    1997లో హిందూపురం నుంచి తాను పోటీ చేసి గెలుపొందానని.. మళ్లీ అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడిగా తన నిధులను ఆ నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించానని హరికృష్ణ వివరించారు. తనకు హిందూపురం మినహా తక్కిన సీటు ఏదీ వద్దని తెగేసి చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో హిందూపురం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనను కూడా హరికృష్ణ తిరస్కరించినట్లు సమాచారం.

    హరికృష్ణ ఒత్తిడి వల్లే బుధవారం చంద్రబాబు విడుదల చేసిన తొలి విడత అభ్యర్థుల జాబితా నుంచి బాలకృష్ణ పేరును చివరి నిమిషంలో తప్పించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇది పసిగట్టిన బాలకృష్ణ బుధవారం రాత్రి చంద్రబాబుతో సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హిందూపురం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందేనని పట్టుపట్టడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.   
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement