
రజనీ పుట్టిన రోజున ఎందిరన్-2కు ముహూర్తం
సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుసగా రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.అందులో ఒకటి కబాలి. నటి రాధికా ఆప్తే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్న కబాలి చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం విదితమే. ఇక రజనీ అంగీకరించిన రెండవ చిత్రం ఎందరన్-2.శంకర్ దర్శకత్వంలో ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన ఎందిరన్ చిత్రం రికార్డులను తిరగరాసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి శంకర్ సిద్ధమయ్యారు. ఈ చిత్రం ఎందిరన్‌ను మించి ఉండే విధంగా ఈయన కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఈ కథను చెక్కుతున్నారని చెప్పవచ్చు.
గ్రాఫిక్స్ నిపుణుడు శ్రీనివాస్‌మోహన్‌ను పిలిపించి ఎందిరన్-2లో గ్రాఫిక్స్ సన్నివేశాల గురించి సుదీర్ఘంగా చర్చించిన శంకర్ చాయాగ్రాహకుడు నిరవ్‌షాతోను చిత్ర చిత్రీకరణ గురించి సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఇందులో రజనీకాంత్‌కు విలన్‌గా విక్రమ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ప్రముఖ బాలీవుడ్ నటులతోనూ శంకర్ జర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే చిత్రంలో నటించే కథానాయిక, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రాన్ని లైకా సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించనుంది. ఎందిరన్-2 చిత్రానికి రజనీకాంత్ పుట్టిన రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రజనీకాంత్ ఈ ఏడాదిలోగా కబాలి చిత్రాన్ని పూర్తి చేసి చిన్న విరామం తీసుకుని ఎందిరన్-2 చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని టాక్.