
కర్ణాటకకు నిధులు పెంచాం
కర్ణాటకకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోందన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాటల్లో...
సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోందన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 13వ ఫైనాన్స్ కమిషన్‌తో పోలిస్తే 14వ ఫైనాన్స్ కమిషన్‌లో కర్ణాటకకు ఇచ్చే నిధులను 32శాతం నుంచి 42 శాతానికి పెంచామని ఆయన తెలిపారు. శనివారమిక్కడి బీజేపీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు ఐదేళ్లలో కర్ణాటకకు దాదాపు లక్ష కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం అందించనుందని తెలిపారు.
ఇక కర్ణాటకలో ఇప్పటికే ఆరు స్మార్ట్ సిటీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. జనాభా, రెవెన్యూ, నగరంలోని పారిశుద్ధ్య వ్యవస్థ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయా నగరాల పేర్లను సిఫార్సు చేసి నివేదిక పంపాలనికోరినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలోని లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హుబ్లీ-ధార్వాడ, మైసూరు, బెళగావి, దావణగెరె, బళ్లారి, బిజాపుర, శివమొగ్గ, తుమకూరు, రాయచూరు, బీదర్, హొస్పేట, కోలారుతో కలిపి మొత్తం 26 నగరాలను ‘అమృత్’ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.