ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం
- ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం
- చున్నీతో కట్టుకుని కాలువలో దూకి
వారిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తమను ఎవరూ విడదీయలేరనే విశ్వాసం వారిలో నిత్యం తొణికసలాడేది. అయితే కాలానుగుణంగా రావాల్సిన మార్పులను ఎవరూ ఆపలేరు కదా. వీరి విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరిలో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడంతో తమ స్నేహానికి అంతిమ గడియలు దాపురించాయని భయపడ్డారు. అలా కాకూడదనుకున్నారు. తమ స్నేహం అజరామరమని ఈ లోకానికి చాటి చెప్పాలనుకున్నారు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మరణం తమకే కానీ తమ స్నేహానికి కాదని చాటి చెప్పారు. శ్రీరంగ పట్టణ తాలూకాలోని మజ్జిగపురలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి.
మండ్య : రామనగర తాలూకాలోని హొంబేగౌడన దొడ్డికి చెందిన పవిత్ర (22), చన్నపట్టణ తాలూకాలోని కాచహళ్లికి చెందిన జయంతి (22)లు ఎనిమిదో తరగతి నుంచి బీకాం వరకు కలసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి స్నేహం పటిష్ట పునాదులను పరుచుకుంది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వారు. ఒకరినొకరు వదిలి ఉండేవారు కాదు. జయంతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ పెళ్లి జయంతికి ఇష్టం లేదు.
పవిత్ర వివాహం చేసుకునే వరకు తానూ పెళ్లి చేసుకోకూడదనేది ఆమె ఉద్దేశం. అయితే పవిత్రకు అక్క ఉంది. ముందుగా ఆమెకు పెళ్లి కావాలి. ‘నిన్ను వదిలి ఈ పెళ్లి చేసుకోను’ అని పవిత్రకు జయంతి చెప్పింది. ఇద్దరూ తర్జన భర్జన పడ్డారు. చివరికి తమ స్నేహానికి అమరత్వం కల్పించాలని నిర్ణయించుకున్నారు. గురువారం మధ్యాహ్నం పవిత్ర తన ఇంటిలో మరణ వాంగ్మూలం రాసి టేబుల్‌పై ఉంచింది. అనంతరం జయంతిని కలుసుకుంది.
ఇద్దరూ రామనగర నుంచి కృష్ణరాజ సాగర జలాశయం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి మజ్జిగపురం చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి పక్కన పడవేశారు. చున్నీలతో చేతులు కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర కుటుంబ సభ్యులు మరణ వాంగ్మూలాన్ని చూసి గాబరా పడ్డారు. ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఫోన్ చేసినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని ఇరు కుటుంబాల వారు పోలీసులను ఆశ్రయించారు.
స్థానిక పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం మజ్జిగపుర కాలువలో ఇద్దరి మృత దేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు పక్కన పడి ఉన్న ఫోన్లను స్విచాన్ చేశారు. వెంటనే బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ ఇద్దరి మృత దేహాలు ఉన్నాయని పోలీసులు తెలపడంతో, అందరూ అక్కడికి చేరుకుని బోరుమన్నారు.
డెత్‌నోటు వివరాలు
నేను మరియు జయంతి చని పోవాలని నిర్ణయించుకున్నాము. జయాకు పెళ్ళి చేసుకొవడం కొంచెం కూడ ఇష్టం లేదు. ఆమెకు కావాలిసింది నేను మాత్రమే. మీ స్వార్థం కోసం మమ్మల్ని ఇద్దరిని దూరం చేయకండి. రెండు తలలు కలిసి ఉంటాయి కాని, రెండు జడలు ఒక దగ్గర ఉండవని అంటారు కాని. అది మేము అబద్దమని నిరూపించాము. ఎంతో మంది ప్రేమ కోసం చనిపోతున్నారు. కాని స్నేహం కోసం ఎవరూ చనిపోరు. ఆ స్నేహం కోసం చని పోవాలని మేము మాత్రం నిర్ణయించుకున్నాము. గుడ్ బై. మా ఇద్దరి స్నేహితులకు వేరీ సారీ. ఇప్పటి వరకూ నేను ఎవరినీ ఏమి అడగ లేదు. మేము చనిపోయే ముందు అడిగేది ఒక్కటే. నన్ను జయంతిని ఇద్దరిని ఒకే చోట మట్టిలో ఫూడ్చండి. ఇది మా ఇద్దరి ఆశ. నా తల్లిదండ్రులను కోరేది కూడ ఇది ఒక్కటే.
- (పవిత్ర)