![సీఎం హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/71496148266_625x300.jpg.webp?itok=0H5b9pVG)
సీఎం హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు
ముంబై : లాతూర్ జిల్లా నిలంగా తాలూకాలో ఇటీవల జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదం తరువాత తేరుకున్న హోం శాఖ ప్రముఖుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు విమానం, హెలికాప్టర్‌ల భద్రతపై త్వరలో ఒక నియమావళి రూపొందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన నిమిషం వ్యవధిలోనే విద్యుత్ తీగకు తగులకుని క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఫడ్నవీస్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ రోజు అసలేం జరిగింది..? తప్పు ఎక్కడ జరిగింది....? అనే వివిధ కోణాలలో విచారణ జరుగుతోంది. దీంతో హెలికాప్టర్‌లో బయలుదేరే ముందు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనేది కొత్త నియమావళి రూపొందించచనున్నట్లు మంత్రి మునగంటివార్ తెలిపారు.
కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు హెలికాప్టర్ టేకాఫ్ కాగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుమ్ము, దూలి గాలిలో పైకి లేచింది. దీంతో పైలట్‌కు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించక ఏం చేయాలో తెలియెక, గందగోళానికి గురై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రోజు మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌పై నీళ్లు చల్లలేదు.
కాగా హెలికాప్టర్ రెక్కల గాలికి దుమ్ము, దూళి గాలిలో ఎగరకుండా హెలీప్యాడ్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. అంతేగాకుండా హెలిప్యాడ్‌కు వందమీటర్ల దూరంలో విద్యుత్ తీగలు గాని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండకూడదు. కాని ఆ రోజు ముఖ్యమంత్రి హెలికాప్టర్ కోసం తయారుచేసిన హెలిప్యాడ్‌కు కొద్ది దూరంలోనే విద్యుత్ తీగలున్నాయి.
అంతేగాకుండా క్రాష్ ల్యాండ్ అయిన ప్రాంతానికి కూత వేట దూరంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. అదృష్ట వశాత్తు దానిపై పడలేదు. లేని పక్షంలో ప్రాణ నష్టం జరిగేది. వీటన్నింటిని బట్టి కొన్ని నియమాలు పాటించలేదని ఈ ఘటన ద్వారా స్పష్టమైతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. త్వరలో వాస్తవాలు బయటపడతాయి.