కుటుంబ సభ్యులపై కానిస్టేబుల్ కాల్పులు
- బావమరిది మృతి
- భార్య పరిస్థితి విషమం
బళ్లారి (తోరణగల్లు) : కట్టుకున్న భార్య, ఆమె సోదరుడిపై ఓ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బావమరిది మరణించాడు. భార్య చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే... మాజీ ఎంపీ శాంత వద్ద గన్‌మన్‌గా బళ్లారికి చెందిన ప్రసాద్ (25) పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన ఇతను నిత్యం మద్యం మత్తులో కప్పగల్లులోని ఇంటికి చేరుకుని భార్యను వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి చేరుకుని అర్ధరాత్రి 12 గంటల వరకు భార్య వరలక్ష్మి(20)తో గొడవ పడ్డాడు.
అనంతరం ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటి తలుపు వేసుకున్నాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన అన్న నాగరాజు(30)కు వరలక్ష్మి తెలిపి, సాయం చేయాలని కోరింది. ఆ సమయంలో చెల్లెలు ఇంటి వద్దకు నాగరాజు చేరుకుని ప్రసాద్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో నాగరాజుపై ప్రసాద్ దాడికి తెగబడ్డాడు. ఇక చేసేదేమీ లేక తన చెల్లెలిని ఇంటికి పిలుచుకెళ్లేందుకు సిద్ధమై బైక్ స్టార్ట్ చేస్తుండగా ప్రసాద్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఒక బులెట్ నాగరాజు ఎదలో దూసుకెళ్లింది. మరో బులెట్ వరలక్ష్మి కడుపులో నుంచి అవతలకు వెళ్లిపోయింది. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు అక్కడకు చేరుకుంటుండగా ప్రసాద్ పారిపోయాడు. క్షతగాత్రులను వెంటనే విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు మరణించాడు. వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడిని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.