
ఐదుగురు అన్నదాతలు...
బెంగళూరు (బనశంకరి)/మండ్య : రాష్ర్ట వ్యాప్తంగా ఐదుగురు అన్నదాతలు ఒకేరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ పక్క ప్రభుత్వం రైతులకు అండగా ఉన్నామంటూ ఆత్మస్ధైర్యం నింపుతున్నా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండడం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. పంట నష్టాలు, అప్పులు తీర్చే మార్గం కానరాక శనివారం తుమకూరు, కల్బుర్గి జిల్లాల్లో ఐదుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. తుమకూరు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని కోరా హొబ ళి నందిహళ్లి గ్రామానికి చెందిన రైతు హాలప్ప(55) తనకున్న ఒకటిన్నర ఎకరా పొలంలో పంట సాగు కోసం పెట్టుబడుల కింద రూ. 4.50 లక్షలు అప్పు చేశాడు.
పంట నష్టంతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. దీంతో అప్పులు తీర్చేమార్గం కానరాక తన పొలంలోని చెట్టుకు ఆయన ఉరి వేసుకున్నాడు. రాత్రి పొద్దుపోయినా తన భర్త ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు ఆయన భార్య ఇందిరమ్మ వెళ్లి చూడడంతో ఘటన వెలుగు చూసింది. శిరా తాలూకా కసాభా హొబళికి చెందిన రైతు కుమారస్వామి(53) తనకున్న మూడు ఎకరాల పొలంలో 150 కొబ్బరి, 350 వక్క చెట్లను పెంచారు. వీటి కోసం కెనరాబ్యాంక్, స్వయం సహాయక సంఘాల్లో రూ. 5 లక్షలతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద కూడా అప్పు చేశాడు.
ఇటీవల అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరగడంతో వాటిని తీర్చే మార్గం కానరాక శుక్రవారం రాత్రి తన పొలంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుబ్బి తాలూకా కొణేమాదేనహళ్లి గ్రామానికి చెందిన రైతు వేదమూర్తి(45) తనకున్న నాలుగు ఎకరాల పొలంలో వక్క, కొబ్బరి, అరటి సాగు చేశాడు. పంట పెట్టుబడుల కోసం కావేరి గ్రామీణ బ్యాంక్, ధర్మస్ధళ సహకార బ్యాంక్, ఎస్‌బీఎం బ్యాంకులో రుణాలు చేశాడు. కొద్ది రోజుల క్రితం అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. డబ్బు లేకపోవడంతో తన పొలంలోని చెట్టుకు వేదమూర్తి ఉరి వేసుకున్నాడు.
కలబురిగి జిల్లా రాజ్‌పుర్ గ్రామానికి చెందిన రైతు మాణిక్‌రెడ్డి(48) పంట పెట్టుబడుల కోసం సహకార బ్యాం కులో రూ. 1.80 లక్ష మేర అప్పు చేశాడు. అకాల వర్షాలతో పంట నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో పొలంలోని చెట్టుకు మాణిక్‌రెడ్డి ఉరి వేసుకున్నాడు. మండ్య జిల్లా పాండవపుర తాలూకా బన్నాంగడి గ్రామానికి చెందిన రైతు హుచ్చేగౌడ(50), పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.