పురుగుమందులూ భారమే.. | pesticides also burden | Sakshi
Sakshi News home page

పురుగుమందులూ భారమే..

Published Wed, Aug 7 2013 4:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

pesticides also burden

 మార్కాపురం, న్యూస్‌లైన్: విత్తు విత్తింది మొదలు..మొక్క పెరిగి దిగుబడి చేతికొచ్చే వరకు పంటను పసిపాపలా కాపాడుకుంటూ వస్తాడు రైతు. ఈ మధ్య కాలంలో తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు రైతు గుండెపై గుదిబండగా మారుతున్నాయి. మూడేళ్లుగా వ్యవసాయానికి ప్రభుత్వ సాయం కరువవడంతో కొందరు రైతులు సాగుకు దూరమయ్యారు. మరికొందరు దింపుడు కళ్లెం ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడుల భారం రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎరువులతో పాటు పురుగు మందుల ధరలు కూడా పెరగడంతో ఒక్క మార్కాపురం వ్యవసాయ డివిజన్‌లోని రైతులపైనే ఏడాదికి రూ. 22.56 కోట్ల అదనపు భారం పడుతోంది. మార్కాపురం వ్యవసాయ డివిజన్‌లో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్ డివిజన్‌లు ఉన్నాయి.
 
 డివిజన్ పరిధిలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుండగా, కంది తగ్గనుంది. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, అర్ధవీడు మండలాల్లో 30 వేల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మిర్చి సాగు కానుంది. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దదోర్నాల మండలాల్లో 20 వేల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మిర్చి సాగుకు సన్నద్ధమవుతున్నారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట మండలాల్లో 37 వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో మిర్చి సాగు కానుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి, మిర్చి పైర్లపై శనగపచ్చ పురుగు, పచ్చదోమ, తెల్లదోమ, సన్నపురుగు, పేను బంక తెగుళ్లు ఆశిస్తున్నాయి. వీటి నివారణ కోసం రైతులు ఎసిఫేట్, ఫ్రైడ్, ఇమిడా క్లోఫిడ్, మోనోక్రోటోఫాస్, ప్రిఫాన్‌లిస్ మందులను వాడుతుంటారు.   
 
 మిర్చి పండించే ప్రతి రైతు ఎకరాకు దాదాపు 12 లీటర్ల ఇమిడా క్లోఫిడ్ పురుగుమందును ఉపయోగిస్తాడు. గత ఏడాది లీటర్ రూ. 850 ఉన్న ఇమిడా క్లోఫిడ్ ఇప్పుడు రూ. 1050 నుంచి రూ. 1100 వరకు కంపెనీలను బట్టి ధర పలుకుతోంది. లీటర్‌పై కనీసం రూ. 200 అదనపు భారం పడుతోంది. డివిజన్ మొత్తం మీద 65 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతుంది. ఎకరాకు 12 లీటర్ల చొప్పున 7.80 లక్షల లీటర్ల మందును ఉపయోగిస్తే..రైతులపై లీటర్‌కు రూ. 15.60 కోట్ల భారం పడనుంది. అలాగే డివిజన్‌లో పత్తి 87 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఎకరాకు 4 లీటర్ల చొప్పున 3.48 లక్షల లీటర్ల ఇమిడా క్లోఫిడ్ పురుగుమందును ఉపయోగిస్తారు. లీటర్‌పై రూ. 200 అదనపు భారంతో  మొత్తం రూ. 6.96 కోట్ల అదనపు భారం పడుతుంది.  గతేడాది ఎసిఫేట్ కిలో రూ. 420 ఉండగా ఈ ఏడాది రూ. 450 విక్రయిస్తున్నారు. మోనోక్రోటోఫాస్ లీటర్ ధర గతేడాది రూ. 325 ఉండగా, ఈ ఏడాది రూ. 350 అయింది.
 
 ఎసిఫేట్ మందును పత్తి, మిర్చి పంటల్లో శనగపచ్చ పురుగు, పచ్చదోమ నివారణకు, ఇమిడా క్లోఫిడ్ మందును తెల్లదోమ, పచ్చదోమ నివారణకు, మోనోక్రోటోఫాస్‌ను సన్న, పచ్చపురుగు నివారణకు రైతులు ఉపయోగిస్తుంటారు. పురుగు మందులు వాడకపోతే దిగుబడులు తగ్గిపోతాయి. దీంతో వాటి వాడకం తప్పనిసరి. డాలర్ విలువ పెరిగే కొద్దీ పురుగు మందుల కంపెనీల యజమానులు ధరలను పెంచుతున్నారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కంపెనీ యజమానుల ఇష్టారాజ్యంగా మారింది. ఎక్కువగా హైదరాబాదు, బాంబే, పూణె ప్రాంతాల నుంచిపురుగు మందులు దిగుమతి అవుతుంటాయి. ఓ వైపు పెరిగిన ఎరువుల ధరలు, మరో వైపు పురుగు మందుల  భారంతో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడిపోతున్నారు. ప్రభుత్వం పెరిగిన ధరలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement