
రైతులకు భరోసా కల్పించాలి
♦ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వానికి మేధావుల విజ్ఞప్తి
♦ ఆత్మహత్యలు అధికంగా జరిగే మండలాలపై దృష్టిపెట్టాలి
♦ పరిహారం నిర్ణీత సమయంలో అందకపోతే అప్పీలుకు అవకాశమివ్వాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. అన్నదాతల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే మండలాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని మేధావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ఐక్యకార్యాచరణ సమితి సోమవారం హైదరాబాద్‌లో ‘రైతుల ఆత్మహత్యలు- వ్యవసాయ సంక్షోభం’పై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో పలువురు ప్రముఖులు, మేధావులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న మండలాలు 50 నుంచి 60 వరకు ఉన్నాయని టీజేఏసీ కోదండరాం పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నిర్ణీత సమయంలో పరిహారం అందకపోతే అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలని.. రైతులకు భరోసా కలిగించేలా అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యల సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించలేదని... మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాల వద్దకు వెళితే ఆ తీవ్రత తెలుస్తుందని తెలంగాణ రైతు జేఏసీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. పంటల బీమాలో అనేక నిబంధనలున్నాయని, న్యాయమూర్తినైన తనకే అర్థంకాకుంటే సామాన్యులకు ఎలా అర్థమవుతుందని ఆయన ప్రశ్నించారు.
రైతులు తమ అప్పులు తీర్చుకునేందుకు వారి ఖాతాలో ప్రభుత్వం రూ.లక్ష జమచేయాలని.. విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతు కుటుంబానికి అప్పుతీరలేదని, అలాంటి కేసు ఒక్కటైనా ఉంటే చూపించాలని ఆయన సీఎంను సవాలు చేశారు. రైతుల ఆత్మహత్యలను నివారించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చాలనే అంశాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలను నిందించడం కాకుండా ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలో చర్చించాలని సూచించారు.
సాక్షి’ మీడియా తరఫున మెదక్, ఆదిలాబాద్, అనంతపురం జిల్లాల్లో సమావేశాలు పెట్టాలని నిర్ణయించామని, వీటికి కోదండరాం వంటి ప్రముఖులను, స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తామని చెప్పారు. రైతుల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ వ్యవసాయ విధానాలు తయారవుతున్నాయని సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ విమర్శించారు. ఐటీ, పారిశ్రామికీకరణ వ్యామోహంలో పడి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రొఫెసర్ రమామెల్కొటే పేర్కొన్నారు. ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామేగానీ, రైతుల ఆకలిచావులు కూడా ఉన్నాయని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. ఈ భేటీలో వరంగల్ రైతు జేఏసీ నాయకుడు వెంకటనారాయణ, ప్రొఫెసర్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.