ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
ఆర్థికశాఖకు నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోందా? అనే ప్రశ్నకు బదులివ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆర్థిక సంక్షోభం ఉన్నట్లయితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించేందుకు భారత రాజ్యాంగం అవకాశం కల్పించిందని వారు పేర్కొన్నారు. -సాక్షి ప్రతినిధి, చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఆర్థికశాఖకు నిధుల కేటాయింపుల అంశంపై 2001లో న్యాయవాది యానై రాజేంద్రన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 2011లో రాష్ట్రంలోని సబ్‌కోర్టుల్లో ఫర్నిచర్ కొనుగోలు ధర 10 శాతం పెరిగినందున, ఈ మొత్తంతో కలిపి రూ.9.41 కోట్లు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మద్రాసు హైకోర్టు తానుగా ముందుకు వచ్చి విచారణ చేపట్టింది. న్యాయస్థానాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది వసంతకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అన్నీ కలిపి ఒకటిగా మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే కౌల్, న్యాయమూర్తులు శివజ్ఞానం, మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి తరఫున బదులు పిటిషన్ దాఖలైంది.
ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్లన పరిశీలించిన న్యాయమూర్తులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పాలనలో భాగమైన న్యాయశాఖకు ప్రాథమిక, మౌళిక సదుపాయాలను కల్పించడం కోసం నిధులను కేటాయించక పోవడం తమకు ఎంతో బాధను కలిగిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర న్యాయశాఖ అకాడమీకి నిధులను కేటాయించని కారణంగా న్యాయమూర్తులకు ఇచ్చే రెండు శిక్షణ పథకాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేగాక రూ.35 లక్షల అదనపు నిధుల కేటాయింపుకు ప్రభుత్వం పరిశీలించి అంగీకరించినట్లుగా సంబంధిత అధికారుల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తమకు సమాచారం అందినా ఇంత వరకు నిధుల జాడ లేదని వారు ఆక్షేపించారు. రూ.150 కోట్ల విలువైన వంద పథకాలు గురించి వెల్లడిచేసిన అభిప్రాయాలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వారు అన్నారు. 50 పథకాలు తొలిదశగా, మిగిలిన 50 పథకాలు రెండోదశగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపిందని అన్నారు. అయితే ఏ పథకానికి నిధులను కేటాయించారో ఇంతవరకు తమకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా వ్యవహరించని కారణంగా రూ.150 కోట్ల నిధులు మురిగిపోయాయని వారు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి దక్కిందని వారు తెలిపారు. న్యాయస్థానాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని వారు గుర్తు చేశారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు కేంద్రం ప్రభుత్వం సహాయాన్ని మాత్రమే చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం థార్థిక సంక్షోభంలో కూరుకుపోయిదా లేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లుగా ప్రకటించే ఆలోచన ఏమైనా ఉందాని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నది నిజమైన పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారాన్ని భారత రాజ్యాంగం 360 సెక్షన్ కల్పించిందని వారు గుర్తు చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిపోయినట్లు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అనే అంశానికి బదులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని న్యాయమూర్తులు ఆదేశిస్తూ కేసును ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు.
ఆర్థిక సంక్షోభమా?
Published Sat, Nov 12 2016 3:28 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement