ఆప్ కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులకు మధ్య శుక్రవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులకు మధ్య శుక్రవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలతో సహా ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, అవసరమైతే ఎమ్మెల్యేలను అరెస్టు కూడా చేస్తామని పోలీసు కమిషనర్ భీంసేన్ బస్సీ శనివారం మీడియాకు తెలియజేశారు. నగరంలోని బురాడీ పోలీసు స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరగడంతో పోలీసులు బురాడీ ఎమ్మెల్యే సందీప్ ఝా, మోడల్ టౌన్ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠిపై హింసను ప్రేరేపించారనే అభియోగాల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘర్షణలో ఆరుగురు ఆప్ కార్యకర్తలతోపాటు తొమ్మిదిమంది పోలీసులు గాయపడ్డారు. ప్రధాన్ ఎన్‌క్లేవ్ కాలనీలో ఓ బాలుడిని ఎత్త్తుకుపోతున్న కిడ్నాపర్లను స్థానికులు పట్టుకున్నారని, నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరామని ఆప్ కార్యకర్తలు చెప్పారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించడంతో ఎమ్మెల్యే సంజీవ్‌ఝాకు ఫోన్ చేశామన్నారు.
కార్యకర్తల నుంచి ఫోన్ రావడంతో ఝా రాత్రి పదకొండు గంటలకు బురాడీ పోలీస్‌స్టేషన్‌కు కారులో చేరుకున్నారు. గేటు వద్ద నిలబడిన సెంట్రీ ఆయన కారును ఆపి దురుసుగా ప్రవర్తించాడని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు. చేతిలో ఉన్న రైఫిల్‌ను ఝాపై ఎక్కుపెట్టాడని వారు చెప్పారు. ఆ తరువాత ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని గొడవకు దిగారు. మోడల్ టౌన్ నియోజకవర్గ శాసనసభ్యుడు అఖిలేష్ త్రిపాఠీ కూడా కొంతమంది కార్యకర్తలతో ఇదే పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఆప్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిపై లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే కారుకు స్టిక్కర్ లేదని, అందువల్ల సెంట్రీ ఆపివేశాడని పోలీసులు అంటున్నారు. ప్రజలు తమపై రాళ్లు రువ్వారని, ఈ కారణంగా తాము లాఠీ చార్జీ చేయాల్సివచ్చిందని పోలీసులు చెప్పారు. వారిలో అసాంఘికశక్తులు కూడా ఉన్నారన్నారు. ఈ సమాచారం అందడంతో డీసీపీ మథుర్‌వర్మతో పాటు పలువురు పోలీసు అధికారులు సదరు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 147, 148, 149,322,353, 186, 337 సెక్షన్ల కింద ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, చట్టవిరుద్ధంగా గుమిగూడడం, విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగిని అడ్డుకోవడం, ఘర్షణను సృష్టించడం ఇత్యాది ఆరోపణలతోపాటు హింసను ప్రేరేపించార నే అభియోగాల కింద పోలీసులు బురాడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. అరడజను మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై బురాడీ స్టేషన్ పోలీసులు లిఖితపూర్వ నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపారు.