
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం పెను ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్థుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సార్జాపూర్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
ఏడుగురిని కాపాడినట్టు రాష్ట్ర అగ్నిమాపకదళం, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఎస్డీఆర్‌ఎఫ్ అధిపతి ఎంఎన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. శిథిలాల కింద ఇంకా కొంత మంది ఉండే అవకాశముందన్నారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భారీ భవనం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.