ఎటాక్
► చెన్నైకి చేరిన అన్నదాతల ఆందోళనల సెగ
► కత్తిపార ఫ్లైవోర్ దిగ్బంధం
► అర్ధ్దనగ్న ప్రదర్శన – రాస్తారోకో
ప్రశాంతంగా సాగిపోతున్న జనజీవనం అకస్మాత్తుగా స్తంభించిపోయింది. వేగంగా పరుగులు తీసే వందలాది వాహనాలకు ఉన్నట్లుండి బ్రేక్ పడింది. రాస్తారోకోలతో అన్నాసాలై, అర్ధనగ్న ఆందోళనకారులతో శాస్త్రిభవన్ అట్టుడికింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరువు కోరల నుంచి కాపాడాలని కోరుతూ తమి ళనాడు రైతులు నెలరోజులకుపైగా ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళనల సెగ గురువారం చెన్నైని తాకి ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అష్టకష్టాలను ఎదుర్కొంటున్న అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన గురువారానికి 31వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలో రోజుకో రీతిలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు గురువారం నాడు మండుటెండలో నడిరోడ్డుపై పల్టీలు కొడుతూ ర్యాలీగా ముందుగా సాగారు.
అలాగే తంజావూరు జిల్లాలో రైతులు సాగిస్తున్న ఆందోళనలు 17వ రోజుకుచేరుకున్నాయి. వ్యవసాయ మంత్రి దురైకన్ను రైతన్నలతో జరిపిన చర్చలు విఫలమైనాయి. రైతుల అండగా త్వరలో ఆందోళనకు దిగుతున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ ప్రకటించారు. డిల్లీలో గురువారం తమిళ రైతులను పరామర్శించిన టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ, రైతుల ఆవేదనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
కత్తిపార ఫ్లైవోర్ దిగ్బంధనం :
అక్కడి అన్నదాతలకు ఇక్కడి విద్యార్ది, యువజన సంఘాలు గత కొన్నిరోజులుగా సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. దీంతో ఇక లాభం లేదను అనుకున్న యువజన, విద్యార్ది సంఘాల ప్రతినిధులు ఒక పథకం ప్రకారం నగరం నలుమూలలకు రహస్యంగా ప్రవేశించారు. తమిళ సినీ దర్శకుడు గౌతమన్ నేతృత్వంలో వందలాది మంది యువకులు ఉదయం 9.30 గంటల సమయంలో గిండీలోని కత్తిపార ఫ్లయివోవర్‌కు చేరుకున్నారు. రోడ్డు రెండువైపులను కలుపుతూ బలమైన భారీ గొలుసులను అమర్చి తాళాలు వేశారు.
సహజంగా ఫ్లయివోవర్లపై పోలీసులు ఉండరు. దీంతో అందోళనకారుల పని సులువుగా పూర్తయింది. అంతే ఒక్కసారిగా అటువైపు తాంబరం, ఇటువైపు అశోక్ పిల్లర్, అన్నాశాలై వైపు సైదాపేట వరకు కిలోమీటర్ల పొడవునా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు, పోలీసులు ఏమైందోనని బిత్తరపోయారు. ట్రాఫిక్ పోలీసులు షాక్ నుండి తేరుకునేలోపే ఉద్యమకారులు ప్లకార్డులతో ఫ్లైవోవర్‌పై బైఠాయించారు.
ఉరుకులు పరుగులతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనాకారులను చెదరగోట్టే ప్రయత్నం చేయగా స్వల్పఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను బలవంతంగా రోడ్డుపై నుండి లాగివేసి గుంపులు గుంపులుగా అరెస్ట్ చేశారు.. వాహనాల రాకపోకలకు అడ్డంగా నాలుగు వైపు రోడ్డుల్లో కట్టిన గొలుసులను తొలగించేందుకు పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. గొలుసులకు రెండువైపులా వేసిన తాళాలను పగులగొట్టలేక పడరాని పాట్లు పడ్డారు.
ఇదిలా ఉండగా, తమిళర్ ఎళుచ్చి ఇయక్కం కార్యకర్తలు చెన్నై అన్నాశాలైలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ప్రధాని మోదీ మాస్క్‌లు నిరసన ప్రదర్శన చేశారు. పలువురు కార్యకర్తలు ఒంటికి గొలుసులు చుట్టుకుని ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. అలాగే నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రిభవన్ ముందు తందై పెరియార్ ద్రావిడర్ కళగంకు చెందిన 30 మందికి పైగా కార్యకర్తలుల అర్దనగ్న ప్రదర్శనకు దిగారు. అకస్మాత్తుగా రాస్తారోకోకు పూనుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అందరినీ అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా నగరం నలుమూలల నుండి ఆందోళనకారులు విరుచుకుపడటంతో ప్రజలు, పోలీసులు ఉక్కిరిబిక్కిరై పోయారు.