మండ్య, మస్కి, మైసూరు ప్రాంతాల్లో బలవన్మరణానికి పాల్పడ్డ ముగ్గురు రైతులు
బెంగళూరు: కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల పరంపరకు ముగింపు కనిపించడం లేదు. గురువారం సైతం రాష్ట్రంలోని మండ్య, మస్కి, మైసూరు ప్రాంతాల్లో మొత్తం ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు....మండ్య జిల్లాలోని కె.ఆర్.పేట తాలూకా దొడ్డతారళ్లి గ్రామానికి చెందిన ప్రదీప్(37) తన పొలంలో చెరకు పంట కోసం రెండు లక్షల రూపాయలు అప్పులు చేశారు. అయితే చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక పురుగుల మందు తీసుకొని గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక మాస్కి ప్రాంతానికి దుర్గా క్యాంపస్ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనివాస్(35) సైతం పురుగుల మందు తీసుకొని గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాస్ తనకున్న ఐదెకరాల పొలంలో వరి పంట వేశారు. ఇందుకు గాను దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చే మార్గం కనిపించక శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
మైసూరులోనూ....
ఇక మైసూరు జిల్లాలోని కిరంగూరు గ్రామానికి చెందిన అంగడి రాజేగౌడ(52) సైతం అప్పుల బాధ తట్టుకోలేక గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. రాజేగౌడకు కిరంగూరు ప్రాంతంలో మూడెకరాల పొలం ఉంది. ఈ పొలంలో చెరకు పంట వేసేందుకు గాను మొత్తం రూ.5 లక్షల వరకు రాజేగౌడ అప్పులు చేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇక అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
ఆగని రైతన్నల ఆత్మహత్యల పరంపర...
Published Fri, Jul 3 2015 1:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM
Advertisement
Advertisement