దిగువ కోర్టు తీర్పును సవాలు చేసిన ఇద్దరు దోషులు
Published Tue, Oct 8 2013 2:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
న్యూఢిల్లీ: సామూహిక అత్యాచార కేసులో దిగువకోర్టు ఇచ్చిన తీర్పును దోషులు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లు హైకోర్టులో సవాలుచేశారు. ఈ మేరకు వారి తరపు న్యాయవాది ఎ.పి.సింగ్ సోమవారం ఓ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ దిగువ న్యాయస్థానం గత నెలలో తీర్పు వెలువరించిన సంగతి విదితమే. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కదులుతున్న బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిని నలుగురు దోషులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి విదితమే.
ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను దిగువకోర్టు న్యాయమూర్తి ఆలకించలేదని పిటిషనర్లు పేర్కొన్నార ని న్యాయవాది తెలిపారు. వినయ్ శర్మ వయస్సు 17 సంవత్సరాలేనని, అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ బాలనేరస్తుల చట్టం కింద విచారించాలని విన్నవించారన్నారు. వినయ్ పుట్టిన తేదీ పత్రాలను అతడి స్వగ్రామం తెప్పించి, సమర్పించాలంటూ దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. అంతేకాకుండా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవరించాలని కోరినట్టు తెలిపారు.
తన వయస్సు 17 సంవత్సరాల ఎనిమిది నెలలేనని, అందువల్ల మైనరేనని వినయ్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నట్టు సింగ్ తెలిపారు. వయోనిర్ధారణ కోసం తనకు ఎముకల పరీక్ష చేయించాలని వినయ్ కోరాడని, అయితే సదరు విన్నపాన్ని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చిందన్నారు. కారాగారంలోనే ఉన్నప్పటికీ వినయ్ బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడన్నారు. వినయ్ జైలుకు రాకముందు జిమ్ ట్రెయిన్ అని, తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవాడని సింగ్ తెలిపారు.
Advertisement
Advertisement