
ఆ కళ మగాళ్లకే అధికం
ప్రేమించడం అనేది ఒక గొప్పకళ అని అంటున్నారు హన్సిక. ఈ బ్యూటీ స్వీయ అనుభవంతో చెబుతున్నారా? ఇంతకీ ఈమె ఏమి చెప్పదలచుకున్నారు. అదేంటో చూద్దాం హిట్ చిత్రాల కథానాయికి హన్సిక. ఆ మధ్య అరణ్మణై చిత్ర హిట్‌తో తెగ సంతోష పడిపోయిన ఈ అమ్మడు తాజాగా ఆంబళ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అదే విధంగా జయంరవి సరసన నటించిన రోమియో జూలియట్ నటి జయప్రద వారసుడు సిద్ధుతో జత కట్టిన ఉయిరే ఉయిరే చిత్రాల విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం విజయ్‌తో పులి చిత్రంలో నటిస్తున్నారు. వ్యక్తిగతంగా చూస్తే ఆ మధ్య శింబుతో ప్రేమాయణం సాగించి ఆ తరువాత దానికి గుడ్‌బై చెప్పిన హన్సిక అనూహ్యంగా ప్రేమ గురించి కాచి వడపోసినట్లు ప్రేమించడం సాధారణ విషయం కాదు. అదో గొప్ప కళ అని పేర్కొన్నారు. ఇంకా వివరంగా చెబుతూ ఆడవారి కంటే మగవారికి ఈ కళ ఎక్కువగా అబ్బుతుందన్నారు. పురుషులు ప్రేమిస్తున్నారా? లేదా? అన్నది వారి కళ్లు చూస్తేనే తెలిసిపోతుందన్నారు. కొందరు కళ్లతోనే ప్రేమను వ్యక్తం చేస్తారన్నారు. చూపులతోనే అమ్మాయిలను ప్రేమలో పడేలా చేసుకోగలరని చెప్పారు. అయితే ఆడవారు అలా కాదని వారు ప్రేమించినా ఆ విషయాన్ని త్వరగా బయటపెట్టలేరని పేర్కొన్నారు. వీరి మనసులో ఏముందో చెప్పడం కూడా కష్టమన్నారు. ఇది సొంత అనుభవంతో చెబుతున్న మాటలని అనుకోవద్దని ప్రేమించిన స్నేహితురాళ్లను చూసిన అనుభవంతో చెబుతున్న మాటలివని హన్సిక అన్నారు.