కాజీపేట శ్రీ శ్వేతార్కమూలగణపతికి 158 కిలోల నెయ్యితో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
వరంగల్ : కాజీపేటలో కొలువైన శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి 158 కిలోల నెయ్యితో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. దేవాలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకుడు రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కాశీ నుంచి తెచ్చిన పవిత్ర నదీ జలాలతో అభిషేకాలు, అర్చనలు జరిపించారు. భక్తులు శ్వేతార్కుడిని పూలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. పండితులు గోత్రనామాలతో సహస్రనామార్చనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లయ్యశర్మ సిద్ధాంతి, రాధాకృష్ణశర్మ, తేలు సారంగపాణి, మణి, రవి తదితరులు పాల్గొన్నారు.