విముక్తి కల్గించిన పోలీసులు
బెంగళూరు: దాదాపు ఏడేళ్లుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ బాలికను పోలీసులు రక్షించి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని డీ.జే హళ్లికి చెందిన షేక్‌సుభాన్, బాను దంపతులకు 12 మంది పిల్లలు. వీరిలో పద్నాలుగేళ్ల (ప్రస్తుతం) సల్మా (పేరుమార్చబడింది) తొమ్మిదో సంతానం. పేదరికంతో బాధపడుతున్న షేక్‌సుభాన్, బానులు బ్రిగేడ్ రోడ్డులో ఉంటున్న నస్రీన్ తాజ్ అనే ఆమెకు సల్మా (అప్పుడు ఆమెకు ఏడేళ్లు)ను దత్తత ఇచ్చారు. రెండేళ్లు నస్రీన్ తాజ్ సల్మాను బాగానే చూసుకున్నారు.
అయితే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. దీంతో కాక్స్‌టౌన్‌లో నివాసం ఉంటున్న తనకు అక్క వరుస అయ్యే ఫరీదాకు.. సల్మా బాధ్యతలను నస్రీన్ అప్పగించింది. అప్పటి నుంచే సల్మా కష్టాలు మొదలయ్యాయి. ఫరీదా...ఇంటి పనులన్నింటినీ సల్మా చేత చేయించేది. చీటికి, మాటికీ కొడుతూ గాయాలపై కారం పొడిని కూడా చల్లేది. సరైన తిండి కూడా పెట్టేది కాదు. అంతే కాకుండా ఈ ఏడేళ్ల కాలంలో సల్మాను ఒంటరిగా ఒక్కసారి కూడా ఇంటి నుంచి బయటికి పంపించేది కాదు. ఎప్పుడైనా సల్మాను బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే ఫరీదా కూడా సల్మాతో పాటు ఉండేది.
ఇలా దాదాపు ఏడేళ్ల కాలం పాటు సల్మాకు ఫరీదా ప్రత్యక్ష నరకం చూపించింది. ఇదిలా ఉండగా నస్రీన్ తాజ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సల్మాను చూడాలని ఉందని ఫరీదాను పదిరోజుల ముందు నస్రీన్ కోరారు. దీంతో తప్పని పరిస్థితుల్లో సల్మాను తీసుకుని ఫరీదా...నస్రీన్ ఇంటికి ఆటోలో బయలు దేరారు. హలసూరు పోలీస్‌స్టేషన్ వద్దకు ఆటో చేరుకోగానే సిగ్నల్ పడింది. దీంతో ఆటోలో ఉన్న సల్మా ఒక్కసారిగా కిందికి దిగి పోలీస్‌స్టేషన్‌లోకి పరుగెత్తింది.
అక్కడ పోలీసులకు తన పరిస్థితి మొత్తం వివరించింది. హలసూరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది డీ.జే హళ్లిలోని మసీదు వద్దకు వెళ్లి అక్కడి స్థానికుల సహాయంతో సల్మా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం సల్మాను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫరీదాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.