అత్యాచారం చేసిన వాడినే పెళ్లాడింది
చెన్నై : అత్యాచారం చేసిన వ్యక్తినే యువతి వివాహమాడింది. ఈ సంఘటన కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది. చర్చనీయాంశంగా మారిన కోర్టు కేసును ఇది మలుపు తిప్పింది. కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలో గల సౌందరచోళపురానికి చెందిన మోహన్.... 2008లో అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భవతి అయి... బాలికకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మోహన్ను అరెస్ట్ చేశారు.
అయితే సదరు చిన్నారి రెండో తరగతి చదువుతోంది. కడలూరు మహిళా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది. ఆ క్రమంలో మోహన్కి ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 2 లక్షల జరిమాన విధిస్తూ... న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ... మోహన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించి... తాను అత్యాచారం చేసిన యువతిని పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో న్యాయమూర్తులు యువతిని, మోహన్ను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరింది. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. పలువురు న్యాయ నిపుణులు కూడా దీనిని వ్యతిరేకించారు.
దీంతో సామరస్య కేంద్రానికి పంపే ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. ఈ కేసుపై పునర్విచారణ జరపాలంటూ కడలూరు కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మళ్లీ విచారణ సాగింది. అయితే కోర్టు తీర్పు వచ్చే రెండు వారాల ముందుగా వారు ఇరువురూ వివాహం చేసుకున్నట్లు న్యాయవాది చంద్రశేఖర్ కోర్టుకు తెలిపారు. డిసెంబరు 24వ తేదీ ఇరువురికి రిజిస్టర్ పెళ్లి జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో కథ సుఖాంతం అయింది.